నల్లగొండ సిటీ, నవంబర్ 26 : భారత రాజ్యాంగం అందరి హక్కులకు రక్షణ కల్పింస్తుందని నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని మౌలిక హక్కులు, బాధ్యతలు ప్రతి పౌరుడు తెలుసుకుని ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు, అధికారులు రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదర భావం వంటి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారందరిచే భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో చండూర్ ఆర్డీఓ శ్రీదేవి, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్ నాయక్, సి సెక్షన్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండ డివిజన్ కార్యాలయంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ సీనియర్ అధికారులు కేకే షా, ఆదిమల్ల శంకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదిమల్ల శంకర్ మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో అత్యంత ఉత్కృష్టమయిన రాజ్యాంగాన్ని మనకి అందించిన బాబా సాహెబ్ అంబేద్కర్, వారి బృందానికి మనం సర్వదా రుణపడి ఉంటామన్నారు. వ్యక్తిగత హక్కులతో పాటు, బాధ్యతలను కూడా విడమర్చి వివరించిన అత్యున్నత రాజ్యాంగం మనదని పేర్కొన్నారు. ఇటువంటి విశిష్ట రాజ్యాంగ స్ఫూర్తిని మనం ఎప్పటికీ పాటించాలని సూచించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను పఠించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీనియర్ అధికారులు కెఎన్కే ప్రసాద్, అజ్మీరా రాజు, ఉద్యోగులు గోపయ్య, శ్రీకాంత్ రెడ్డి, దివ్య, సునంద, అరుణ్, పీఆర్ ఇన్చార్జి సతీశ్ రెడ్డి పాల్గొన్నారు.

Nalgonda City : ‘అందరి హక్కులకు రక్షణ భారత రాజ్యాంగం’