Vijay | తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్న విజయ్, ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొత్త చర్చలకు కేంద్రబిందువయ్యారు. ఆయన స్థాపించిన టీవీకే (Tamilaga Vettri Kazhagam) పార్టీ ద్వారా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం కూడా కీలక మలుపు తిరిగే పరిస్థితి నెలకొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్న నేపథ్యంలో విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా సాగుతుందనే ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు, అంటే ఏప్రిల్ 20న ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలకమైన కేసుపై కోర్టు తీర్పు వెలువడనుంది. ఈ తీర్పు ఆయన రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
విజయ్ వ్యక్తిగత జీవితం ఇటీవల వివాదాల్లో చిక్కుకుంది. ఆయన భార్య సంగీత కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. విజయ్‌కు ఓ నటితో సన్నిహిత సంబంధం ఉందని ఆరోపిస్తూ సంగీత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దాదాపు 27 సంవత్సరాల వైవాహిక బంధాన్ని ముగించాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ వివాహేతర సంబంధం కారణంగా తాను తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నానని పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో సంగీత ఈ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ అనంతరం ఏప్రిల్ 20న తీర్పు వెల్లడిస్తామని న్యాయస్థానం ఇప్పటికే తెలిపింది. దీంతో ఈ తీర్పు విజయ్ రాజకీయ ప్రయాణంపై కూడా ప్రభావం చూపుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ప్రస్తుతం తమిళనాడులో అధికార డీఎంకే మరియు ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ టీవీకే పొందే ఓట్లు ఎన్నికల ఫలితాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలన్నీ విజయ్ వైపు దృష్టి సారించాయి. ఆయనను తమ వైపు తిప్పుకోవాలని ప్రతిపక్ష శక్తులు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే పొత్తుకు సిద్ధం, లేకపోతే 234 స్థానాల్లో స్వతంత్రంగా పోటీకి సిద్ధం అనే సంకేతాలు విజయ్ ఇస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల ముందు విడాకుల కేసుపై వచ్చే తీర్పు రాజకీయంగా ఎలా ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు ఈ తీర్పు వెలువడనుండటంతో విజయ్ శిబిరంలో కూడా కొంత టెన్షన్ నెలకొన్నట్లు తెలుస్తోంది.