మెదక్, జూలై 2(నమస్తే తెలంగాణ): అధికారంలోకి వస్తే అన్నదాతకు ఎన్నో చేస్తామని కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. సన్నవడ్లు సాగు చేస్తున్న రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. మెదక్ జిల్లాలో యాసంగింలో 100 కేంద్రాలు ఏర్పాటు చేసి 9733 మంది రైతుల నుంచి 36,278 వేల మెట్రిక్ టన్నుల సన్నవడ్లు ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు కేంద్రంలో వడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం రూ.18.14 కోట్ల డబ్బు పెండింగ్‌లో పెట్టింది. దీంతో రైతులు బోనస్ ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
యాసంగిలో రైతులు రూ.లక్షలు ఖర్చు చేసి సన్నవడ్లు పండించి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇం దులో సన్నాలు కొనేందుకు 100 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 95,313 మంది రైతుల నుంచి 4.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. ఈ ధాన్యం 65 రైస్ మిల్లులకు తరలించారు. కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన ధాన్యానికి రూ.1077 కోట్లు చెల్లించారు. 5 వేల మంది రైతులకు సుమారు రూ.78 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉంది.
యాసంగిలో రైతులు పండించిన సన్న వడ్లకు ఇస్తామన్న బోనస్‌ను సీజన్ ముగిసినా ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో రైతుల ఆశలు నీరుగారిపోతున్నాయి. వానకాలం సాగుకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను రైతులు ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొన్నది. రైతులు తూకాలు వేస్తున్నారు. నాట్లు వేసేందుకు భూము లు సిద్ధం చేస్తున్నారు. మార్కెట్లో డీజిల్ ధరలు పెరగడంతో దుక్కులు దున్నే ట్రాకర్ల ధరలు పెంచారు. దీంతో రైతులకు పెట్టుబడి భారం పెరిగిపోయింది. ఫలితంగా రైతన్నలు అగమ్యగోచరంలో పడ్డారు.
యాసంగిలో 100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సన్న వడ్లు కొన్నాం. ప్రభుత్వం మెదక్ జిల్లా రైతులకు బోనస్ రూ. 18.14 కోట్లు చెల్లించాల్సి ఉంది. సన్న వడ్లకు సంబంధించిన బోనస్ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తాం. ఈ నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
– జగదీశ్వర్, మేనేజర్, పౌరసరఫరాల శాఖ మెదక్