పదో తరగతి ప్రశ్నపత్రాల లీకు వీరుడు బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి తీరును ఖండిస్తూ వారు బుధవారం వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ఎంపీగా కొనసాగుతున్న బండి సంజయ్ ఎంపీ పదవికి అనర్హుడంటూ బీఆర్ఎస్ నేతలు ముక్తకంఠంతో విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. బండి వ్యవహారంపై స్పందించినవారిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, చిలుముల మదన్‌రెడ్డి, మహారెడ్డి భూపాల్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి ఉన్నారు. మరోవైపు సిద్దిపేటలో ‘బండి’ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కంది, ఏప్రిల్ 5: తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక బీజే పీ లీకేజీల పర్వానికి తెరలేపిందని మెద క్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి లేక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నదని విమర్శించారు. బుధవారం కందిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో పేపర్ల లీకేజీ సూత్రదారి బండి సంజయేనని ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్త ద్వారానే పదో తరగతి పరీక్ష పేపర్లను లీకేజీ చేశారన్నారు. ఎంపీగా ఉండి ఇలాంటి చేష్టలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. బండి సంజయ్ ఎంపీ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ చేస్తున్న తప్పులను ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ది చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. సమావేశంలో హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్, ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, నాయకులు రాంరెడ్డి, చేర్యాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.