గజ్వేల్, అక్టోబర్ 1: సెప్టెంబర్ నెలలో విస్తారంగా కురిసిన వానలు ఈ సీజన్లో రైతులు సాగుచేసిన పత్తి, మొక్కజొన్న పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అధిక వర్షాలతో పత్తి పంట ఎర్రబారింది. సీజన్ ప్రారంభంలో కొంత తక్కువగా వర్షపాతం నమోదు కాగా, సెప్టెంబర్ నెలలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తి పంట ఎర్రబారింది. దీంతో దిగుబడి తగ్గే అవకాశాలు ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 1.07లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేశారు.
గతేడాదితో పోల్చిలే ఈసారి పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. అధికంగా కురిసిన వర్షాలతో పత్తి పంటపై భారీగా దెబ్బతిన్నది. సీజన్ ప్రారంభంలో వర్షాలు అనుకూలంగా లేక పత్తి విత్తనాలు వేసినా అధికశాతం మొలకలు రాలేదు. ఆ తర్వాత కురిసిన వానలకు పత్తి పంట వేయగా, అధిక వర్షాలకు పంట ఎర్రబారింది. పూత, కాత తక్కువ రావడంతో దిగుబడిపై ప్రభావం చూపుతున్నది.
పెట్టిన పెట్టుబడులు వచ్చేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబర్ నెలలో ఎడతెరపి లేకుండా కురిసిన వానలకు పత్తి చేన్లలో రోజుల తరబడి వర్షం నీరు నిలిచి పత్తి మొక్కలు ముక్కిపోయాయి. పంట ఎర్రబారింది. రైతులు పత్తి పంటను కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గజ్వేల్ ప్రాంతంతో నల్లరేగడి భూములు అధికంగా ఉండడంతో పత్తికి అనుకూలం కావడంతో ఎక్కువగా రైతులు వానకాలంలో పత్తి సాగుచేశారు. ప్రస్తుతం పత్తి పంట కాత దశలో ఉంది. ఇటీవల అధికంగా కురిసిన వర్షాలకు పత్తి రాలిపోయింది. పత్తి కాయలోపలికి నీళ్లు పోయి మురిగిపోయింది.
సిదిపేట జిల్లాలో గజ్వేల్, రాయపోల్, కొండపాక, కుకునూర్‌పల్లి, జగదేవ్‌పూర్, మర్కూక్, చేర్యాల, కొమురవెల్లి, దౌల్తాబాద్ మండలాల్లో రైతులు ఎక్కువగా పత్తి సాగు చేశారు. నెల రోజులుగా అధికంగా కురుస్తున్న వర్షాలకు చెట్టుకు వచ్చిన కాత, పూత రాలిపోయింది. మరో 15 రోజుల్లో పత్తి దిగుబడి వస్తుందనే నమ్మకంతో రైతులు ఉన్నారు. పంటను కాపాడుకునేందుకు రైతులు యూరియా, 20-20 ఎరువులను వినియోగించడంతో పాటు మందులు పిచికారీ చేశారు. ఎరువులు వేసిన రోజే వర్షాలు కురవడంతో ఎరువుల ప్రభావం ఉండడం లేదు. ప్రస్తుతం ఎకరాకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని, వర్షాలు ఇలాగే కొనసాగితే ఆ దిగుబడి రాదని రైతులు పేర్కొంటున్నారు.