హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తేతెలంగాణ): తెలంగాణ బిడ్డ, సుప్రీంకోర్టు న్యాయవాది మేనకా గురుస్వామికి అరుదైన గౌరవం దక్కింది. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ నుంచి ఆమెను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికచేసింది. పార్లమెంట్‌కు వెళ్లనున్న తొలి ఎల్జీబీటీక్యూ (లెస్బియన్ గే బై సెక్సువల్ ట్రాన్స్‌జెండర్ క్యూయర్)గా భారత చరిత్రలో నిలిచిపోనున్నారు. ఆర్థికరంగ నిపుణుడు మోహన్ గురుస్వామి కుమార్తె మేనకా గురుస్వామి హైదరాబాద్‌లో 1974 నవంబర్ 27న జన్మించారు. హోమోసెక్సువల్ అయిన ఆమె న్యాయవాది అరుంధతి కట్టును వివాహం చేసుకోవడంతో వారు దేశంలోనే తొలి హోమోసెక్సువల్ దంపతులుగా గుర్తింపు దక్కించుకున్నారు. టైమ్స్ మ్యాగ్జైన్ ప్రకటించిన 100 మంది మోస్ట్ ఇన్ఫ్లూయెన్సర్ల జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ సౌత్ సదరన్ గ్రూపు అనే పదాన్ని నిందితులకు ఆపాదిస్తూ పదేపదే వాడడంపై న్యాయపోరాటం చేసి చివరకు విజయం సాధించారు. మేనకా గురుస్వామి న్యాయవాదిగానే కాకుండా రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలిగా ఆ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.