మెదక్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా కేంద్రంలో సమీకృత మార్కెట్ నిర్మాణం పునాదులకే పరిమితమయింది. ప్రజలకు కూరగాయలు, మాంసాహారం ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చింది. అందులో భాగంగా పట్టణంలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయం పక్కన రెండు ఎకరాల స్థలంలో అత్యాధునిక వసతులతో మార్కెట్ నిర్మాణానికి నిర్ణయించింది. గతనడాది & నెలలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 6 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని భావించినప్పటికీ సదరు కాంట్రాక్టర్ నిధులు, బిల్లుల సమస్యలంటూ పనులు నిలిపివేశాడు. దీంతో సరైన స్థలం లేక రైతులు, వ్యాపారులు రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తుండగా, దుకాణాల యజమానులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మున్సిపాలిటీ నుంచి కనీస సౌకర్యాలు కల్పించకపోగా తైబజార్ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు రూ.8 కోట్లతో అదనపు ఎస్టిమేషన్ వేసినట్టు అధికారులు తెలిపారు. కానీ ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు మంజూరైతే మార్కెట్ పనులు కొనసాగే అవకాశం ఉంది. పునాదులకే పరిమితమైన మార్కెట్ పనులను చూసి ప్రజలు నిరాశకు గురవుతున్నారు. తిరిగి పనులు ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని త్వరితగతిన మార్కెట్‌ను నిర్మించి అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.