సిర్గాపూర్, జనవరి 27: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో ఎంతోకాలం నుంచి ఎదురు చూసిన గిరిజన బాలికల గురుకుల పాఠశాల సొంత భవనం కల నెరవేరింది. ఆరేళ్ల నుంచి అద్దె భవనంలో బాలికలు, ఉపాధ్యాయుల బృందం అరకొర వసతుల మధ్య అష్ట కష్టాలు పడ్డారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజన విద్యార్థుల విద్యాభ్యాసం మెరుగుపరచాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ సర్కారు హయాంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి కృషితో అందుబాటులో బాలికలకు 2 గురుకులాలు, బాలురకు 2 ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సిర్గాపూర్ గురుకులం గత ఏడాది ఉన్నత పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియట్‌కు అప్‌గ్రేడ్ కావడంతో ప్రస్తుతం కళాశాల తరగతులు సాఫీగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భద్రత విషయంలో విద్యార్థినులకు సరికొత్త భరోసా ఏర్పడింది.
గురుకులానికి 5 ఎకరాలస్థలం కేటాయింపు
సిర్గాపూర్ శివారులోని 169/2 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన సముదాయం నిర్మించ తలపెట్టారు. ఈ నేపథ్యంలో 2016, డిసెంబర్ 9న మంత్రి హరీశ్‌రావుతో స్థానిక ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. 2017, అక్టోబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభించి పునాదులు తీశారు. అయితే కాంట్రాక్టర్ అలక్ష్యం కారణంగా పునాదుల స్థాయిలో దాదాపు రెండేళ్లపాటు పనులు నిలిచిపోయాయి. దాంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని, సదరు కాంట్రాక్టరుతో పనులు చేయించి గత డిసెంబర్ 23న మంత్రి సత్యవతి రాథోడ్‌తో ప్రారంభోత్సవం చేశారు.
అన్ని వసతులు, హంగులతో భవన సముదాయం…
మూడు అంతస్తులతో భవన సముదాయం నిర్మించారు. ఈ భవనంలో మొత్తం 32 గదులు ఉన్నాయి. ఇందులో తరగతి గదులు 32, లేబరేటరీ గదులు 4, వెల్నెస్ 1, గ్రౌండ్ ఫోర్లో డైనింగ్ హాల్, కిచెన్, స్టాఫ్‌రూమ్, ప్రిన్సిపాల్ రూమ్, స్టోర్ గది ఉన్నాయి. భవనంలో మొత్తం 28 టాయిలెట్స్, స్నానపు గదులు ఉన్నాయి. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ప్రత్యేక స్నానపు గదుల కోసం షెడ్డును నిర్మించారు. దీంట్లో 30 నల్లాలు కూడా బిగించారు. అన్ని సౌకర్యాలు, వసతులతో అన్ని హంగులతో ముస్తాబు చేశారు. చుట్టూ ప్రహరీ నిర్మించారు.
అన్ని సౌకర్యాలు ఉన్నాయి..
నాలుగేళ్ల నుంచి అద్దె భవనంలో అరకొర వసతుల మధ్య చాలా ఇబ్బందులు పడ్డాం. ఇరుకు గదుల్లో చదువుకున్నం. తాగునీటి సమస్య కూడా ఉండేది. ఇప్పుడు కొత్త భవనంలోకి వచ్చాక ఆ సమస్యలన్నీ తొలగిపోయాయి. విశాలమైన తరగతి గదులు, అందులో ఫ్యాన్లు, వెలుతురుతో కిటికీలు ఉన్నాయి. కొత్త భవనంలోకి వచ్చినప్పటి నుంచి మా ఇంటికి పోవాలనిపిస్తలేదు. ఇక్కడనే చాలా ఆనందంగా ఉంది.
– కన్నీబాయి, పదో తరగతి విద్యార్థిని
వసతులు బాగున్నాయి…
కొత్తగా నిర్మించిన భవనంలో అన్ని మౌలిక వసతులతో ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదు. విశాలమైన గదులు, ప్రధానంగా నీటి సరఫరా, విద్యుత్తు సరఫరా నిరంతరం ఉంటుంది. ఆడుకోవడానికి విశాలమైన మైదానం ఉంది. ఇప్పుడు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. అధ్యాపకులు ఆంగ్లమాద్యమంలో అర్థమయ్యేలా బోధిస్తున్నారు. రాత్రివేళ కూడా ప్రత్యేక అభ్యసన తరగతులు, టీచర్ల పర్యవేక్షణ కొనసాగుతున్నది. – ఎం.శోభ, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని
ప్రైవేటు భవనంలో ఇబ్బందులు ఎదుర్కొన్నం..
ప్రైవేటు భవనంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నం. ప్రభుత్వ భవనంలోకి గురుకులం మార్చిన తర్వాత సమస్యలు దూరమయ్యాయి. భవన సముదాయానికి చుట్టూ కంపౌండ్‌తో బాలికలకు రక్షణగా ఉంది. ఎలాంటి అంతరాయం ఉండదు. కొత్త భవనంలోకి వచ్చాక బాలికలు ఎంతో ఆనందంగా ఉన్నారు. విద్యార్థులు చదువుకోడానికి, పడుకోవడానికి, భోజనం చేసేందుకు అన్ని వసతులతో ప్రత్యేక గదులు ఉన్నాయి. ఆడుకునేందుకు భవనం ఎదుట విశాలమైన మైదానం ఉంది. చదువు పట్ల విద్యార్థులు ప్రత్యేక ఆసక్తితో ఉన్నారు. ఇక్కడ ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో బాలికలు జాయిన్ కాగా ప్రస్తుతం మొత్తం 499 మంది చదువుకుంటున్నారు.
– శ్యామలాదేవి, ప్రిన్సిపాల్, ఎస్టీ గురుకులం