నేటి నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్లను నియమించింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స తదితర సౌకర్యాలు కల్పించారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ను అమలు చేయడంతో పాటు జిరాక్స్ దుకాణాలు మూసివేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 52 కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మొత్తం 34,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మెదక్ జిల్లాలో 31 సెంటర్లలో 13,616 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా ఆనుమతి ఉండదని అధికారులు తెలిపారు. హాల్టికెట్లను www.tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, మార్చి 14: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరిసరాల్లో జిరాక్స్ కేంద్రాలు మూసివేయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా వైద్యాధికారులు సమాయత్తమయ్యారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో 52 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 34,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 19,141 మంది మొదటి సంవత్సరం, 15,256 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. 52 మంది, చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్మెంటల్, 957 మంది ఇన్విజిలేటర్లతో పాటు హెచ్పీసీ, డీఈసీ, ఫ్లయింగ్ స్కాడ్, సిట్టింగ్ స్కాడ్ కమిటీలు ఏర్పాటు చేశారు.
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం
మెదక్ జిల్లా వ్యాప్తంగా 13,616 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రథమ సంవత్సరం 6,999, ద్వితీయ సంవత్సరం 6,086 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారిని నియమించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్ స్కాడ్స్ బృందం, 4 సిట్టింగ్ స్కాడ్స్ బృందాలు ఏర్పాటు చేశారు.
విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాయాలి
ఇంటర్మీడియట్ పరీక్షలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్భయంగా పరీక్ష రాయాలి. హాల్ టికెట్లను tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేసవి దృష్ట్యా మంచినీరు, వైద్యం, రవాణాకు సంబంధించి ప్రత్యేక సూచనలు చేశాం. జిల్లాలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకు వీలుగా ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు.
– గోవింద్ రామ్, ఇంటర్మీడియట్ అధికారి, సంగారెడ్డి