జిన్నారం, నవంబర్ 23: రాత్రి సమయంలో శ్వాస తీసుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలికాలం కావడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. వాయు కాలుష్యాన్ని వదులుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వాడల ప్రజలు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడల్లో 50 వరకు రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల నుంచి నిత్యం ఘాటు వాసనతో పొగ బయటకు వెలువడుతున్నది. చలికాలం కావడంతో దట్టమైన పొగ పరిసర గ్రామాలను కమ్మేస్తున్నాయి. దీంతో శ్వాస తీసుకోవటానికి ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటున్నది.
రాత్రి ప్రజలు పడుకున్న సమయంలో పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధ్దంగా దట్టమైన కాలుష్య పొగను బయటకు వదులుతున్నారు. నిత్యం కాలుష్య పొగను పీల్చుకుంటున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. స్థానికంగా ఉన్న రసాయన పరిశ్రమల్లో అనుమతులకు మించి ఉత్పత్తులను చేపడుతుండటంతో కాలుష్యం ఎక్కువైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పీసీబీ అధికారులు పరిశ్రమల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరించటంతోనే వాయు కాలుష్య సమస్య ఎక్కువైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రిపూట ఇక్కడి కాలుష్య పొగ, ఘాటైన వాసన వావిలాల, లక్ష్మీపతిగూడెం, జిన్నారం, జంగంపేట, నల్తూర్ గ్రామాల వరకు చేరుతున్నది. ఇప్పటికైనా పీసీబీ అధికారులు స్పందించి పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించటంతో పాటు వ్యర్థాలు, కాలుష్య పొగను బయటకు వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక వాడల ప్రజలు కోరుతున్నారు.
పరిశ్రమల నుంచి వాయు కాలుష్యం వెలువడుతుండటంతో ప్రజలు ఈ సమస్యను మా దృష్టికి తెచ్చారు. కాలుష్య వాయువులను బయటకు వదలొద్దని, దీని ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పరిశ్రమలకు నోటీసులు ఇచ్చాం. పీసీబీ అధికారులకు ఇక్క డి సమస్యలను వివరించాం. సత్వరమే సమస్యను పరిష్కరించేలా చూస్తాం.
– వెంకటరామయ్య, కమిషనర్ గడ్డపోతారం