మెదక్, ఏప్రిల్10 (నమస్తే తెలంగాణ) : ప్రతి గర్భిణి ప్రభుత్వ దవాఖానలో ప్రసవం చేసుకునేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ దవాఖానలో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే గాక ఉచితంగా అన్ని వైద్య పరీక్షలు చేస్తూ ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్‌తో పాటు ఆడపిల్ల అయితే 13 వేలు, మగపిల్ల వాడైతే 12 వేలు ఇస్తూ చిన్నారులకు టీకాలు ఇస్తుందని ప్రజల్లో అవగాహన కలిగించి వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరిగేలా చూడాలని అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్‌తో కలిసి డిప్యూటీ డీఎంహెచ్వోలు ప్రో గ్రాం అధికారులు, వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ప్రతి రెవెన్యూ డివిజన్లోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపిక చేసి వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరిగేలా కృషి చేస్తున్నామని అన్నారు.
కౌడిపల్లి, పాపన్నపేట, వెల్దుర్తిలో గత జనవరి నుంచి నిర్వహిస్తున్న ప్రసవాలను సమీక్షిస్తూ ప్రభుత్వ దవాఖానల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా ప్రసవాలు చేస్తారని దవాఖానల్లో పరీక్షించుకున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేసుకునేలా వారికి, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. మాతా శిశు సంరక్షణ సేవలో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని, గత నెల 78 శాతం ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు జరిగాయని అన్నారు. 102 వాహనం ద్వారా గర్భిణి ఏఎన్సీ క్లినిక్‌కు హెల్త్ చెక్ అప్‌కు వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుతో పాటు వెంటనే ట్యూబెక్టమీ చేయనందున ప్రైవేట్ దవాఖానలకు వెళ్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా కలెక్టర్ వైద్యాధికారులను సూచించారు.
సాధ్యమైనంత వరకు సీ-సెక్షన్ తగ్గించాలని, ఇన్ఫెక్షన్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన రేడియోలజీ హబ్ ద్వారా 2డీ-ఎకో, ఏక్స్ రే, ఈ సీ జీ మమోగ్రాం వంటి పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని,ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.ఆరోగ్య మహిళా క్లినిక్ ద్వారా రెఫెర్ చేసిన కేసుల ప్రగతిని ఫాలో అప్ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చందు నాయక్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, గైనకాలజిస్ట్ శివదయాల్, డిప్యూటీ డీఎంహెచ్వోలు విజయ నిర్మల, అనిల, మాధురి,ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, ఎంసీహెచ్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.