SP DV Srinivas Rao | శంకరంపేట-ఆర్ మండలంలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై పట్టపగలు దాడి చేసి దోపిడీకి పాల్పడిన సంచలన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి సుమారు 4½ తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 48 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం జంగరాయి గ్రామానికి చెందిన తమ్మల నర్సింలు (48) ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 25న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు తమ్మల అంజయ్య (85), సావిత్రమ్మ (80)పై ఇనుప రాడ్డుతో దాడి చేసి, వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడిని గుర్తించారు. శనివారం (28న) ఉదయం 9 గంటలకు తూప్రాన్ బస్ స్టాప్ వద్ద వరిగే వెంకట నారాయణ (40)ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల వాసి కాగా.. ప్రస్తుతం తూప్రాన్‌లో నివాసం ఉంటున్నాడు. నిందితుడి వద్ద నుంచి 2½ తులాల బంగారు పుస్తెల తాడు, 1½ తులాల గొలుసు, అర్ధ తులం బంగారు ఉంగరం, అలాగే నేరానికి వినియోగించిన TVS XL వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 4½ తులాల బంగారం రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అప్పులు తీర్చుకోవడం కోసం..
దర్యాప్తులో నిందితుడు అప్పులు తీర్చుకోవడం కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దోపిడీకి పాల్పడినట్లు వెల్లడైంది. బాధితులు తనకు పరిచయం ఉన్న బంధువులేనని తెలిసినా, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి పథకం ప్రకారం నేరానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచనలతో రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కృషి చేసి కేసును ఛేదించాయి. కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించి ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రజలు అపరిచితులపై నమ్మకం ఉంచకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

‘పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలి’
Mamata Banerjee | బెంగాల్‌ను టార్గెట్ చేస్తే.. కేంద్రంలో బీజేపీని గద్దె దించుతా : మమతాబెనర్జీ
Suicide | వ్యవసాయ విశ్వవిద్యాలయం అటవి ప్రాంతంలో ఒకరు ఆత్మహత్య