Road Accident | జహీరాబాద్, మార్చి 15 : పరీక్ష రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అన్న మృతి చెందగా చెల్లెలికి తీవ్ర గాయాలైన ఘటన జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి జాతీయ రహదారిపై శనివారం జరిగింది. జహీరాబాద్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని బసవ కళ్యాణ్‌కు చెందిన ప్రదీప్(21), అతని చెల్లెలు ఆశ (18) హైదరాబాద్‌లో ఉంటున్నారు.
శనివారం బసవ కళ్యాణ్‌లో పరీక్ష రాసేందుకు బైక్‌పై హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో జహీరాబాద్ మండలం హుగ్గేల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా నడుపుతూ మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ప్రదీప్ అక్కడికక్కడే మృతిచెందగా, ఆశకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం బీదర్ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ప్రభాకర్ రావు తెలిపారు. వీరిది సొంత గ్రామం బసవ కళ్యాణ్ చెందినవారు.