మెదక్, జనవరి 8(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు మెదక్ రైతులపై కక్షకట్టి సింగూరు నీటిని ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ సింగూరు ప్రాజెక్టు నీటిని వ్యవసాయం కోసం ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఘనపూర్ ప్రాజెక్టు నీటితో వేలాది ఎకరాలకు సాగునీరు అందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో వేలాది ఎకరాలు బీడుగా మారుతున్నాయి. మెదక్ ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండతో హల్దీవాగుతో పాటు ఇతర వాగుల నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదు.
ఇసుక తవ్వకాల కోసం అక్రమంగా అటవీ ప్రాంతంలో రోడ్లు వేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. హల్దీవాగులో ఇసుక తవ్వకాలు అరికట్టాలని జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ హల్దీవాగు, మంజీరా నదిపై 14 చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. ప్రస్తుతం విచ్చలవిడిగా చేస్తున్న ఇసుక తవ్వకాలతో చెక్‌డ్యామ్‌లు కూలిపోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఎరువులు సరఫరా చేయడం లేదు. వ్యవసాయరంగానికి 24 గంటలు విద్యుత్ ఇవ్వకుండా కేవలం 13 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నది. ఎన్నికలు ఉంటేనే రైతుభరోసా వేస్తున్నది. రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ప్రజాపాలన లేదు…ప్రజావ్యతిరేక పాలన సాగుతున్నదని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ప్రత్యేక తెలంగాణకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు..
నమస్తే తెలంగాణ: మెదక్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?
మాజీ ఎమ్మెల్యే: అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల అండతో హల్దీవాగుతో పాటు పలు వాగుల నుంచి జోరుగా ఇసుక అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై జిల్లా యంత్రాంగానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇందిరమ్మ ఇండ్లు, పేదలు నిర్మాణం చేసుకుంటున్న చిన్న ఇండ్లకు సంబంధించి ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వాలి. హల్దీవాగు నుంచి టిప్పర్లు, లారీల్లో ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. భవిష్యత్‌లో నీటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.
నమస్తే తెలంగాణ: కాంగ్రెస్ రెండేండ్ల పాలన చూస్తే రైతు వ్యతిరేక ధోరణి అవులంబిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఎరువులు, పంటల కొనుగోళ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ విషయంలో రైతులు నిరాశలో ఉన్నారు. వీటిపై మీ అభిప్రాయం?
మాజీ ఎమ్మెల్యే: రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు లవలంబిస్తున్నది. రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వడం లేదు. ఎన్నికలు ఉంటేనే రైతుభరోసా వేస్తున్నది. అర్హులైన రైతుల పంట రుణాలు మాఫీ చేయలేదు. రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయలేదు. ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోనస్ ఇస్తామని ప్రకటించి ఇంతవరకు రైతులకు డబ్బులు ఇవ్వడం లేదు. రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. గద్దెనెక్కాక రైతులను కాంగ్రెస్ మోసం చేస్తున్నది.
నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలన ఎలా ఉంది. ఆరు గ్యారెంటీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చామని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. దీనిపై మీరెమంటారు..?
మాజీ ఎమ్మెల్యే: రాష్ట్రంలో అవినీతి, దోపిడీ పాలన సాగుతున్నది. కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల అమలులో ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ నేతలు ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధిచెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధ్దంగా ఉన్నారు. కాంగ్రెస్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయం.
నమస్తే తెలంగాణ: కేసీఆర్ హల్దీవాగుపై చెక్‌డ్యామ్‌లు నిర్మించి కాళేశ్వరం జలాలు తెచ్చి సాగుకు అండగా నిలిస్తే , కాంగ్రెస్ పాలనలో హల్దీవాగు నుంచి ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. భవిష్యత్‌లో సాగునీటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా?
మాజీ ఎమ్మెల్యే: కేసీఆర్ వ్యవసాయ రంగానికి నీరు అందించేందుకు హల్దీవాగు, మంజీరాపై 14 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో వేలాది ఎకరాలకు సాగునీరు అందింది. భూగర్భజలాలు పెరిగి వ్యవసాయ బోరుబావుల్లో పుష్కలంగా నీరు లభించింది. కాళేశ్వరం జలాలతో హల్దీవాగుపై చెక్‌డ్యామ్‌లు నింపడంతో పంటల సాగు పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో రైతులు యాసంగిలో వ్యవసాయం సంతోషంగా చేసుకున్నారు. హల్దీవాగు నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇసుక తవ్వకాలు చేయడంతో చెక్‌డ్యామ్‌లు కూలిపోయే ప్రమాదం ఉంది. చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేయడం లేదు. బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీటితో హల్దీవాగుపై ఉన్న చెక్‌డ్యామ్‌లు నింపడం లేదు. చెక్‌డ్యామ్‌ల్లో నీరు లేక రైతులకు నష్టం జరుగుతున్నది.
నమస్తే తెలంగాణ: కాంగ్రెస్ పాలనలో మెదక్ జిల్లాలో అభివృద్ధి ఎలా ఉంది?
మాజీ ఎమ్మెల్యే: కాంగ్రెస్ పాలనలో మెదక్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. బీఆర్ఎస్ హయాంలో మెదక్ పట్టణంలో రింగ్‌రోడ్డు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేశాం. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రింగ్‌రోడ్డు నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదు. మెదక్ పట్టణ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేస్తే, కాంగ్రెస్ ఆ నిధులు రద్దు చేసింది. కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు బాగా పెరిగిపోయాయి. ప్రజాప్రతినిధులు అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మెదక్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. మెదక్ ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ బీఆర్ఎస్కు ఉంటుంది. ప్రజలకు బీఆర్ఎస్ రుణపడి ఉంటుంది.