రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి మండలాలు కలిపి మెదక్ జిల్లాలో కొత్తగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ అందుబాటులోకి రానున్నది. ఆగస్టు నెలలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన శంఖారావ సభలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించగా, 24 గంటల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో డివిజన్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది.
ఇప్పటికే ఆర్డీవో, పీఆర్ కార్యాలయాలు, డిగ్రీ కళాశాల, సీసీ రోడ్లు, లైటింగ్, డివైడర్‌ను అధికారులు సిద్ధం చేయగా, నేడు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మంత్రి రాక సందర్భంగా పట్టణాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఎన్నో ఏండ్ల కల నెరవేరుతుండడంతో ప్రజలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రాజర్షిషా పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
– మెదక్, (నమస్తేతెలంగాణ)/రామాయంపేట, అక్టోబర్ 1
మెదక్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ):మెదక్ జిల్లాలో రామాయంపేట రెవెన్యూ డివిజన్ ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నేడు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెవెన్యూ డివిజన్ అవతరిస్తున్న తరుణంలో రామాయంపేట వాసులు పెద్దఎత్తున సంబురాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 23న సీఎం కేసీఆర్ మెదక్‌లో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
మాటిచ్చిన 24 గంటల్లోపే ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే స్థానికులు 15 రోజుల్లో కలెక్టర్లకు దరఖాస్తులు అందించవచ్చని నోటిఫికేషన్ ఇచ్చారు. అనంతరం జీవో 284ను విడుదల చేశారు. మెదక్ రెవెన్యూ డివిజన్లోని రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాలు, తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో నార్సింగి మండలాన్ని వేరు చేసి రామాయంపేట కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటుచేశారు.
రెవెన్యూ డివిజన్లో జనాభా
రామాయంపేట రెవెన్యూ డివిజన్లో 1,24,556 మంది జనాభా ఉండనున్నది. ఇందులో రామాయంపేట మండలంలో పురుషులు 20,922 మంది, మహిళలు 21,475 మంది మొత్తం 42,397 మంది ఉన్నారు. నిజాంపేట మండలంలో పురుషులు 13,040 మంది, మహిళలు 13,409 మంది, మొత్తం 26,449 మంది ఉన్నారు. నార్సింగి మండలంలో పురుషులు 8272 మంది, మహిళలు 8554 మంది మొత్తం 16,826 మంది ఉన్నారు. చిన్నశంకరంపేట మండలంలో పురుషులు 19,113 మంది, మహిళలు 19,771 మంది మొత్తం 38,884 మంది ఉన్నారు. మొత్తంగా పురుషులు 61,347 మంది, మహిళలు 63,209 మంది ఉన్నారు. మొత్తం 1,24,556 మంది జనాభా ఉంది.
ఫలించిన ఎమ్మెల్యేపద్మాదేవేందర్రెడ్డి కృషి
రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆగస్టు 23న మెదక్‌లో జరిగిన ప్రగతి శంఖారావం బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్ దగ్గర ఇదే అంశాన్ని ప్రస్తావించారు. వెంటనే స్పందించిన సీఎం రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించారు. ఈ మేరకు రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి మండలాలను కలిపి రామాయంపేట రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. మెదక్ జిల్లాలో ఇప్పటికే మెదక్‌తో పాటు నర్సాపూర్, తూప్రాన్ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
మెదక్ జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు
మెదక్ జిల్లాలో ఇప్పటికే మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలున్నాయి. తాజాగా రామాయంపేట డివిజన్ ఏర్పాటు అవుతున్నది. మెదక్ డివిజన్లో 10 మండలాలు మెదక్, హవేళీఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, పెద్దశంకరంపేట, రామాయంపేట్, నిజాంపేట్, చిన్నశంకరంపేట మండలాలు ఉన్నాయి. రామాయంపేట డివిజన్ ఏర్పాటుతో మెదక్‌లోని రామాయంపేట, నిజాంపేట్, చిన్నశంకరంపేట మండలాలు కలువనున్నాయి.
తూప్రాన్ రెవెన్యూ డివిజన్లో తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి, చేగుంట, నార్సింగి, మాసాయిపేట మండలాలు ఉన్నాయి. ఇందులో నుంచి నార్సింగి మండలం రామాయంపేట రెవెన్యూ డివిజన్లో కలుస్తున్నది. నర్సాపూర్ రెవెన్యూ డివిజన్లో నర్సాపూర్, కౌడిపల్లి, శివ్వంపేట్, కొల్చారం, చిలిపిచేడ్ మండలాలు ఉన్నాయి.