నిజాంపేట, ఫిబ్రవరి14: ట్రావెల్ బస్సును లారీ ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా పాలమాకుల గ్రామానికి చెందిన విజయ్ వివాహం బుధవారం మెదక్ పట్టణంలో ఉంది. పెండ్లికొడుకు బంధువులు సిద్దిపేట నుంచి ట్రావెల్ బస్సులో మెదక్ వైపు ప్రయాణిస్త్తుండగా నిజాంపేట గ్రామ శివారుకు రాగానే ఎదురుగా చేగుంట నుంచి సిద్దిపేటకు వస్తున్న లారీ ట్రావెల్ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 16 మందికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చేర్యాల లింగయ్య (74) అనే వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య విజయలక్ష్మి, కూతురు లలితకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. బస్సు నడిపిన డ్రైవర్ శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. మృతుడు లింగయ్య కుమారుడు రామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నిజాంపేట ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ వెంకటేశ్ పరిశీలించారు.