సంగారెడ్డి, మే 14(నమస్తే తెలంగాణ): జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 74.63 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం జహీరాబాద్ పార్లమెంట్‌లోని ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో 12,25,049 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా ఓటు వేశారు. జహీరాబాద్ పార్లమెంట్లో మొత్తం 16,41,410 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 12,25,049 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 6,08,098 మంది పురుషులు, 616,936 మంది మహిళలు ఓటు వేశారు. గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. 2019 ఎన్నికల్లో 69.70శాతం పోలింగ్ నమోదు కాగా తాజా ఎన్నికల్లో 74.63 శాతం పోలింగ్ నమోదైంది. పెరిగిన ఓటింగ్ శాతంతో ఏ పార్టీకి లాభం జరుగుతుందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతుంది. ఓటింగ్ వివరాలు బయటకు రావటంతో ఎంపీ అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలు ఓటింగ్ సరళిని విశ్లేషించే పనిలో పడ్డాయి. నియోజకవర్గాలు, మండలాల వారీగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ తమకు అనుకూలంగా ఎక్కడ ఓటింగ్ జరిగిందని ఎంపీ అభ్యర్థులు విశ్లేషించుకుంటున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా ఎల్లారెడ్డిలో 77.54 శాతం ఓటింగ్ నమోదైంది. జహీరాబాద్ నియోజవర్గంలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్, జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని 1973 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ఎక్కవ సంఖ్యలో ఓటు వేశారు. జుక్కల్ నియోజకవర్గంలో 1,53,855 మంది ఓటర్లు ఓటు వేయగా 75.83 శాతం పోలింగ్ నమోదైంది. బాన్సువాడలో 1,51,516 మంది ఓటు వేయగా 76.58 శాతం పోలింగ్ జరిగింది. ఎల్లారెడ్డిలో 1,72,928 మంది ఓటు వేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోనే అత్యధికంగా ఎల్లారెడ్డిలో 77.54 శాతం ఓటింగ్ జరిగింది. కామారెడ్డిలో 1,82,325 మంది ఓటు వేయగా 72.71 శాతం ఓటింగ్ నమోదైంది. నారాయణఖేడ్‌లో 1,72,508 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. నారాయణఖేడ్‌లో 76.27 శాతం ఓటింగ్ జరిగింది. అందోలు నియోజకవర్గంలో 1,91,320 మంది ఓటు వేయగా 76.27 శాతం ఓటింగ్ నమోదైంది. జహీరాబాద్ పార్లమెంట్లో అత్యధికంగా ఓటర్లు ఉన్న జహీరాబాద్ అసెంబ్లీలో 2,00,597 మంది ఓటర్లు ఓటు వేయగా 72.80 శాతం ఓటింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్ శాతం 4.93 శాతం పెరిగింది. జహీరాబాద్ పార్లమెంట్లో 2014లో 77.28 శాతం పోలింగ్ నమోదైంది. 10,94,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019లో 69.70 శాతం పోలింగ్ నమోదైంది. 10,44,504 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. దీంతో పెరిగిన ఓటింగ్ శాతం ఏ రాజకీయ పార్టీకి అనుకూలిస్తుందన్న చర్చ పార్లమెంట్ పరిధిలో జోరుగా సాగుతున్నది. ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోలింగ్ సరళిని విశ్లేషించుకుంటున్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలు, మండలాల వారీగా ఓటింగ్‌ను విశ్లేషించుకున్న ప్రధాన రాజకీయ పార్టీల ఎంపీ అభ్యర్థులు ఎవరికి వారే ఓటరు తీర్పు తమకు అనుకూలంగా ఉందని చెబుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యా లు తమకు కలిసి వచ్చాయని, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు తమకు అనుకూలంగా ఓటు వేశారని, పెరిగిన ఓటింగ్ శాతం తమకు కలిసివస్తుందని బీఆర్ఎస్ చెబుతుంది. మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ పాల్గొనటం తమను గెలుపు వైపు నడిపిస్తుందని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. మోదీ ఛరిష్మా, ఆయోధ్య రాముడి సెంటిమెంట్ పని చేసిందని ఓటర్లు ఎక్కువగా పోలింగ్‌లో పాల్గొ ని బీజేపీకి ఓటువేశారని దీంతో ఓటరు తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు ముగిసిన అనంతరం ఈవీఎంలను సంగారెడ్డి జిల్లా గీతం యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌లకు అధికారులు చేర్చారు. ఓటరు తీర్పు స్ట్రాంగ్ రూమ్‌లో భద్రంగా ఉంది. వచ్చేనెల 4న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఓటరు తీర్పు ఎలా ఉందోనన్న ఉత్కంఠ కొనసాగనున్నది.