నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒకప్పుడు తాగునీటి కోసం ‘పానీ’పట్టు తరహాలో యుద్ధాలు జరిగేవి. కిలోమీటర్ల మేర దూరం వెళ్లి ఊట, వ్యవసాయ బావుల నుంచి బిందెలు, కుండలు, డ్రమ్ముల్లో నీటిని తెచ్చుకోవడం అక్కడి ప్రజల దినచర్య. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మిషన్ భగీరథ’తో ఇక్కడ తాగునీటి కష్టాలకు విముక్తి లభించింది. నియోజకవర్గంలోని 124 పంచాయతీలు, 372 ఆవాస ప్రాంతాలకు నాలుగు మార్గాల్లో 530 కిలోమీటర్ల మేర వేసిన పైప్లైన్ల ద్వారా ఇంటింటికీ నిరాటంకంగా నీరు సరఫరా అవుతున్నది. రేగోడ్ మండలం తాటిపల్లి వద్ద నిర్మించిన 350 కిలోలీటర్ల భారీ ట్యాంకు నుంచి ప్రతి తండా, మారుమూల ఉన్న ప్రతి పల్లెకు నీరు చేరుతున్నది. తమ అవస్థలు తెలుసుకుని ఇంటి ముంగిటకే నీళ్లు తెప్పించిన సీఎం కేసీఆర్ సార్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఆడబిడ్డలు అంటున్నారు.
నారాయణఖేడ్, నవంబర్ 4: స్థానిక భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల కొరత, సాగునీటి ప్రాజెక్టుల లేమి వంటి కారణాలతో సమైక్య రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజవకర్గ ప్రజలు దశాబ్దాల పాటు తాగునీటి కోసం ఎన్నో అవస్థలు పడ్డారు. కాలంతో సంబంధం లేకుండా గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్లి బిందెలు, కుండల్లో తెచ్చుకునే వాళ్లు. ఇక్కడి నీటి ఇబ్బందులు ఎంత భయానకంగా ఉండేవో ప్రస్ఫూటం చేస్తూ పుట్టుకొచ్చిందే ‘హద్నూర్‌కు ఎద్దునివ్వొద్దు.. బోరంచకు పిల్లనివ్వొద్దు’ అనే సామెత. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రస్తుతం ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేయండంతో స్వచ్ఛమైన నీరు సరఫరా అవుతున్నాయి.
పానీపట్టు యుద్ధాలే..
వేసవి కాలంలో నీటి కోసం యుద్ధాలను తలపించే దృశ్యాలు ఇక్కడి గ్రామాల్లో నిత్యం కనిపించేవి. పరస్పర దాడులకు దిగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరోవైపు ప్రాణాలను పణంగా పెట్టి ఊట బావుల్లో దిగి నీటిని తెచ్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు, కాలినడకన కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళితే గాని నీరు దొరకని దీనావస్థ అప్పుడు ప్రజలు పడిన నీటి కష్టాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. పలుగుతండా, చల్లగిద్ద తండా మధ్య ఉన్న ఒక బోరుమోటారు కోసం రెండు తండాల వాసులు మూకుమ్మడిగా రాళ్లు, కట్టెలతో దాడులు చేసుకున్నారు. నాగల్గిద్ద మండలం కొండ్యానాయక్ తండాలో మహిళలు ప్రమాదకర బావిలో దిగి నీరు తోడుకున్న దృశ్యాలు అప్పట్లో రోజుల తరబడి పత్రికలు, టీవీ చానళ్ల పతాక శీర్షికల్లో నిలిచాయంటే నీటి కోసం అక్కడి గిరిజనులు ఎంతటి సాహసాలు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక కంగ్టి మండలంలోని పలు గ్రామాలు, తండాల్లోని ప్రజలు ఎడ్ల బండ్లపై నీటిని తెచ్చుకున్న చేదు జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. గ్రామాల్లో ట్యాంకర్లు, మినీట్యాంక్లు, బోరుమోటార్లు, నల్లాల వద్ద వరుస కట్టి మరీ రెండు, మూడు బిందెల నీటి కోసం గంటల తరబడి వేచి ఉన్న సందర్భాలున్నాయి. ప్రజల ఒత్తిడి మేరకు సింగూరు ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో అప్పట్లో రెండు తాగునీటి పథకాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి పెద్దగా సత్ఫలితాలనివ్వలేదనే చెప్పాలి. ఆ తాగునీటి పథకాల వల్ల ఎండాకాలంలో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు.
నీటి కష్టం తీరిందిలా..
మిషన్ భగీరథ పథకం పుణ్యమా అని ఇక్కడి ప్రజల తాగునీటి కష్టాలు తీరాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 124 పంచాయతీలు 372 ఆవాస ప్రాంతాలకు నాలుగు మార్గాల్లో ఏర్పాటు చేసిన పైప్లైన్ల ద్వారా నిరాటంకంగా నీరు సరఫరా అవుతున్నది. రేగోడ్ మండలం తాటిపల్లి వద్ద నిర్మించిన 350 కిలో లీటర్ల భారీ ట్యాంకు నుంచి నియోజకవర్గానికి నీటిని అందిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 530 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను వేశారు. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా 600, 400, 300, 250 డీఐ వైశాల్యం ఉన్న పైపులను ఉపయోగించడంతో ప్రతి తండా, మారుమూల గ్రామానికి సైతం సునాయాసంగా నీరు సరఫరా అవుతున్నది. ఇదే కాకుండా నాలుగు మార్గాల్లో మొత్తం 1,150 కిలో లీటర్ల సామర్థ్యం గల భారీ నీటి సంపులను నిర్మించారు. ప్రతి రోజు నియోజకవర్గంలోని 1.65 లక్షల జనాభాకు సరిపడా 20 వేల కిలోలీటర్ల నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనాదిగా ఆడపడుచులు పడుతున్న అరిగోసకు శాశ్వతంగా చెక్ పడడంతో మిషన్ భగీరథ పథకం అందరి దృష్టిని ఆకర్షించింది. దేశానికే ఆదర్శంగా నిలిచింది.
టీఆర్ఎస్ ప్రభుత్వం మా కష్టాలు తీర్చింది
మా ప్రాంతంలో నాలుగైదేండ్ల క్రితం తాగునీటి కరువు ఉండేది. పెద్దపెద్ద ఊర్లళ్ల సైతం ఎసుంటి సౌలత్ ఉండకుండే. ఇగ, తండాల్లో అయితే చానా కష్టం ఉంటుండే. మా తండా శివారులో ఉన్న ఒక బావిలోకి దిగి తండావోల్లం నీళ్లు తెచ్చుకుంటుంటిమి. ఎండాకాలంల మా తండా బావి ఫొటోలు పేపర్లల్ల, టీవీలల్ల చూపిస్తుండ్రి. ఇగ మా గతి ఇంతే అనుకున్నం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లు ఇచ్చి మాకు కష్టం లేకుండా చేసింది. ఆడబిడ్డల కష్టం తీర్చిన సీఎం కేసీఆర్ సారు మేలు మరువం.
– చాందిబాయి, కొండ్యానాయక్ తండా
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పుణ్యమే
నీళ్ల కోసం ఎన్నో బాధలు పడ్డం. అప్పట్ల ఉన్న ఏ ప్రభుత్వం పట్టించుకోలే. మా ఊరిపొంటి మంజీరా నది పారినా, మా ఊళ్లనే మంచి నీటి పథకం పెట్టినా నీళ్లు మాత్రం రోజు రాకుండే. కొన్ని ఊళ్లకు మాత్రమే ఆ నీళ్లు సరఫరా అయితుండే. సీఎం కేసీఆర్ సార్ మిషన్ భగీరథ పథకం పెట్టి ఇంటింటికి నల్లా బెట్టి ఆడబిడ్డల బాధలు దూరం చేసిండు. నీళ్ల కోసం ఇక్కడి జనాలు పడిన బాధలు సీఎం కేసీఆర్ సార్ పుణ్యంతో దూరమైనయి. నీటి కష్టాలు తీరినందుకు సంతోషంగా ఉంది. సీఎం సారుకు, టీఆర్ఎస్ సర్కార్‌కు రుణపడి ఉంటాం.
– సత్యమ్మ, బోరంచ