మునిపల్లి,అక్టోబర్ 15 : రెండు వాహనాల్లో ఒడిశా నుం చి మహారాష్ట్రకు తరలిస్తున్న 260 కిలోల ఎండు గంజాయిని మంగళవారం రాత్రి పట్టుకున్నట్లు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ సీఐ సుమన్ కుమార్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు ఆయన వివరాలు వెల్ల్లడించారు. మునిపల్లి మండలంలోని కంకోల్ టోల్‌ప్లాజా వద్ద మునిపల్లి ఎస్సై రాజేశ్‌నాయక్ తన సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు.
రాత్రి 11 గంటలకు హైదరాబాద్ వైపు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న బ్రీజా కారు(TS07FP0710), బొలేరో (OD04L8885) వాహనాల్లో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి స్మగ్లర్లు పారిపోతుండగా, మునిపల్లి పోలీసులు వెంబడించి నలుగురిని పట్టుకున్నారు, మరో ముగ్గురు పరార య్యారు. పట్టుబడిన వారు ఒడిశాకు పిటారా పరిచ్ఛా, డేవిడ్ పాల్, ధరంఛంద్ ఫైక్, సంజీవ్ కుమార్ పరిచ్ఛాగా గుర్తించారు. వారి నుంచి రెండు వాహనాలు, నాలుగు సెల్ఫోన్లు,130 ప్యాకెట్ల గంజాయితో పాటు రూ.17,500నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాలోని గం జామ్ జిల్లా చంద్రగిరి నుంచి మహారాష్ట్రలోని మాలెగావ్‌కు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు తెలిసింది. నిందితులు వాహనాలకు తప్పుడు నెం బర్ ప్లేట్లు బిగించినట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు సీఐ తెలిపారు. గం జాయి సాగు, సరఫరా, విక్రయాలపై సెల్ 8712656777 నెంబర్‌కు ప్రజలు సమాచారం అందించాలని సీఐ సూచించారు. స్మగ్లర్లను పట్టుకున్న మునిపల్లి ఎస్సై రాజేశ్‌నాయక్, ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు, క్లూస్‌టీం సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు సీఐ తెలి పారు. మునిపల్లి ఎస్సై రాజేశ్ నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.