బుధవారం 30 సెప్టెంబర్ 2020
Medak - Aug 10, 2020 , 23:57:01

చెక్‌డ్యాంలు, కుంటలకు జలకళ

చెక్‌డ్యాంలు, కుంటలకు జలకళ

తూప్రాన్‌ రూరల్‌ : తూప్రాన్‌ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. సోమవారం సైతం ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి.  పంట పొలాలు, కట్టుకాల్వలు, చెక్‌డ్యాంల్లోకి  భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఉపాధి హామీ కింద చేపట్టిన పనులతో  తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌ కట్టు కాల్వకు కొత్తకళ వచ్చింది. 

  వర్షపు నీరు వృథాపోకుండా నేరుగా  కట్టుకాల్వ నుంచి గ్రామ శివారులోని ఊరచెరువులోకి ప్రవహిస్తుంది. ఊరచెరువు కింద 500 ఎకరాల ఆయకట్టు ఉంది. కట్టుకాల్వకు మరమ్మతులు చేయకపోవడం వల్ల కొన్నేండ్లుగా చెరువులోకి వర్షపు నీరు చేరడం లేదు. దీంతో చెరువు కింద ఆయకట్టు భూములు బీడుగా మారాయి.  గ్రామ శివారులోని అటవీప్రాంతం మీదుగా కట్టుకాల్వ ద్వారానే ఊరచెరువులోకి వర్షం నీరు చేరుతుంది. దీంతో గ్రామంలోని 200 మంది ఉపాధి హామీ కూలీలతో గతంలో 15 రోజుల్లోనే కట్టుకాల్వ మరమ్మతులు పూర్తి చేశారు. కట్టుకాల్వలో ఏపుగా పెరిగిన  ముండ్ల పొదలు, కలుపు మొక్కలు, గడ్డి, చెత్తాచెదారాన్ని తొలిగించారు. 3 కిలోమీటర్ల పొడవునా కట్టుకాల్వలో మరమ్మతు పనులు పూర్తి చేయడంతో ఊరచెరువులోకి నీరు చేరి జలకళను సంతరించుకున్నది. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

యావాపూర్‌ చెక్‌డ్యాంలోని వర్షం నీరు.. 

తూప్రాన్‌ మండలం యావాపూర్‌ శివారులోని చెక్‌డ్యాంలోకి వర్షం నీరు వచ్చి చేరుతుండటంతో గ్రామంలోని యువకులు, చిన్నారులు అక్కడకు చేరుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

వెల్దుర్తిలో ఎడతెరపి లేకుండా...

వెల్దుర్తి : మండలవ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి 2 గంటల ప్రాం తంలో ప్రారంభమైన వర్షం సోమవారం ఉదయం వరకు మోస్తరుగా కురువగా 3.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైం దని ఆర్‌ఐ ధన్‌సింగ్‌ తెలిపారు. రాత్రి వానతో పాటు సోమ వారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రోజంతా వర్షం కురువడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది.  హల్దీవాగుపై నిర్మించిన నాలుగు చెక్‌డ్యాంలు నిండడంతో మరిన్నీ చెక్‌డ్యాంల్లోకి నీరు చేరుతున్నది.

 చేగుంటలో మోస్తరు వర్షం

చేగుంట : చేగుంట, నార్సింగి మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


logo