సిద్దిపేట, నవంబర్ 01(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం ధాన్యం సేకరణపై కాంగ్రెస్ సర్కా రు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పేరుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నా, ధాన్యం మాత్రం సేకరించడం లేదు. రైతులు ధాన్యం తీసుకువచ్చి 20 రోజు లు దాటుతున్నా సెంటర్లలో ధాన్యం కొనడం లేదు. గన్నీ బ్యాగులు లేక, మిల్లుల అలాట్మెంట్ కాక, ఇతరత్రా సమస్యలతో ధాన్యం కొనలేక పోతున్నామని సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పలుచోట్ల దీపావళి పండుగ పూట వర్షం కురవడంతో ధాన్యం తడిసి ముద్దయ్యింది.
తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కంటనీరు పెట్టారు. సిద్దిపేట జిల్లాలో 3,68,000 ఎకరాల్లో వరిసాగు కాగా, 8 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో నుంచి 4 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెదక్ జిల్లాలో 2.97 లక్షల ఎకరాల్లో వరిసాగైంది. సంగారెడ్డి జిల్లాలో 1,08,415 ఎకరాల్లో వరి సాగు చేయగా, 2.32 లక్షల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. 2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, లక్ష్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. ప్రభుత్వ నిర్ణయం అసమగ్రంగా ఉండడంతో ఈసారి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. క్వింటాల్‌కు రైతులు రూ. 300 నుంచి రూ. 400 వరకు నష్టం జరుగుతున్నది.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను నిర్ణీత కాలంలో నడపకపోవడం మూలంగా రైతులు వ్యాపారులను ఆశ్రయించి ధాన్యం అమ్ముకుంటున్నారు. సన్న రకానికి రూ.500 బోనస్ ఇవ్వడం దేవుడెరుగు, అసలు ధాన్యమే కొనడం లేదని రైతులు వాపోతున్నారు. కేంద్రాలు కొనుగోళ్లు ఎంత ఆలస్యమైతే అంత ధాన్యం బహిరంగ మార్కెట్లో వ్యాపారుల చేతిలోకి పోతుందని ప్రభుత్వ భావనగా ఉంది. అందుకే ఆలస్యం చేస్తున్నదని రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఒకవేళ ధాన్యం కొన్నా డబ్బులు సకాలంలో వేస్తారో లేదో అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేటు తక్కువైనా వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు దాటినా ఇంత వరకు ధాన్యం కొనడం లేదని రైతులు వాపోతున్నారు. ఇటీవలే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మిల్లు అలాట్మెంట్ కాలేదని కుంటి సాకులు చెబుతూ ధాన్యం కొనడం లేదని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తం గా ఇదే పరిస్థితి ఉంది. చాలాచోట్ల ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు అక్కడనే పడిగాపులు కాస్తున్నారు. పేరుకు మాత్రమే ఇన్ని కేంద్రాలను ప్రారంభించామని చెబుతున్నారు తప్పా… క్షేత్రస్థాయిలో పూర్తి విరుద్ధంగా ఉంది. ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 140 మిల్లులకు సీఎంఆర్ కోసం ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.
ఇది అయ్యేది ఎప్పుడు, ఆయా కేంద్రాలకు మిల్లులు అలాట్మెంట్ అయ్యేది ఎన్నడూ, తమ ధాన్యం అమ్ముడు పోయేది ఎప్పుడు అంటూ రైతులు ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ధర ఏ-గ్రేడ్‌కు రూ. 2320, బి- గ్రేడుకు రూ. 2300 నిర్ణయించింది. సన్నరకం వడ్లకు రూ. 500 బోనస్ అదనంగా ఇస్తామని చెప్పింది. ప్రభుత్వం మీద నమ్మకం లేకనో..లేదా మరోటి కార ణం కావచ్చు మొత్తంగా రైతులు వ్యాపారులకు ధా న్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇప్పటి వరకు వ్యాపారులే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశారు.తేమ తదితర వాటికి కొంత కోత పెట్టుకొని వ్యాపారులు క్వింటాలు ధాన్యానికి రూ. 1900 నుంచి రూ. 2100 వరకు కొనుగోలు చేసి 15 రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలిసింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో 417, మెదక్ జిల్లాలో 380, సంగారెడ్డి జిల్లాలో 211 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలు, ఫ్యాక్స్, మార్కెట్ల ద్వారా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సెంటర్ల సంఖ్య బాగానే ఉంది. కానీ, వీటి లో 20 శాతం కేంద్రాల్లో కూడా ధాన్యం సేకరణ జరగడం లేదు. పేరుకు సెంటర్లలో కనీస సౌకర్యాలు లేవు. తేమ శాతం మిషన్, జల్లి, టార్పాలిన్, దొడ్డు, సన్న రకం వడ్లను గుర్తించడానికి కావాల్సిన మిషన్లు ఇంత వరకు రాలేదు. గన్నీ బ్యాగులు సిద్ధంగా లేవు, మిల్లుల అలాట్మెంట్ పూర్తికాలేదు. ఇవన్నీ చేయకుండానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాం లో కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను కల్పించిన తర్వాతనే ధాన్యం కొనుగోలు చేసేశారు. ధాన్యం కొన్న 72 గంటల్లోనే రైతుల ఖాతాలో నేరుగా డబ్బులను వేసేవారు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి లేదు.
వచ్చిపోయే మబ్బులతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి వాన వస్తుందో..ధాన్యం తడిసిపోతుందనే బెంగ రైతులను వెంటాడుతున్నది. పొద్దుగాళ్ల ఎండ పగటిల్లా మబ్బులు, సాయంత్రం ఎండ, ఇలా రావడంతో రైతు లు ధాన్యం అరబెట్టడం, దగ్గర పోయడం దీనికే సరిపోతున్నది. ఒకవేళ అలానే ఉంచుదాం అంటే వర్షం వచ్చి ధాన్యం అంతా తడుస్తుందనే భయం. ధాన్యం ఆరబోయకపోతే బూజు వస్తుంది. దీంతో రోడ్లపైనే ధా న్యం అరబెడుతూ అక్కడే రైతులు గడుపుతున్నారు.
ధాన్యం తూకం వేయకుండా ఆపడం ప్రభుత్వానికి సరికాదు. మేము పండించిన పం టంతా నేలపాలవుతున్నది. వర్షం రావడంతో ఆరబోసిన ధాన్యం మొత్తం కొట్టుకు పోతున్నది. పేరుకే కొనుగోలు కేంద్రాల పెట్టారు తప్ప కొనడం లేదు. ఉన్న ఆ కాస్త ధాన్యం కూడా ఎండకు ఆరబోస్తే ఉన్నదంతా కొట్టుకుపోయింది.
-సార్గు భాగ్యమ్మ, రైతు, రాయిలాపూర్, రామాయంపేట
ఆరుగాలం కష్టపడి పండించినం వడ్లను ఆరబోస్తే ఉన్నదంతా కొట్టుకుపోయింది. ఇలాంటి బాధ ఏ రైతుకు కూడా రావద్దు.కొనుగోలు కేంద్రాలు పెట్టిన ప్రభుత్వ అధికారులు ఎందుకు తూకం వేయడం లేదు. ఆరబోసిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలి. లేకుంటే మాకు నష్టాలు తప్పవు
-నర్సింహులు,రైతు, ఆర్.వెంకటాపూర్, రామాయంపేట
మా ధాన్యం మొ త్తం వర్షానికి తడిసి ముద్దయ్యింది. చేతికి రాకుండా మొత్తం గింజలన్నీ కొట్టుకు పోయినయ్. ఏం చేయాలో అర్థం కావడం లేదు.ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కనీసం టాపర్లు లేక ధాన్యం అంతా చేతికి రాకుండా పోయింది. రైతుబంధు రాక అట్ల నష్టపోయినం. ఇప్పుడు వడ్లు అమ్ముకుంటే పైసలు అస్తాయనుకుంటే ఇప్పుడు ఆ ఆశకూడా లేకుండా పోయింది.
-లక్ష్మి, మహిళా రైతు, రామాయంపేట
మెదక్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో గురు, శుక్రవారం వర్షం కురవడంతో మార్కెట్ యార్డులో విక్రయానికి తెచ్చిన ధాన్యం తడిసింది. దీంతో రైతులు ఆవేదన చెందారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు తెచ్చి కుప్పలుగా పోసిన ధాన్యం సైతం ఆకస్మిక వర్షానికి తడిసింది. మెదక్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి నీటిలో కొట్టుకుపోయింది.
కష్టమంతా నీళ్లపాలు అయ్యిందని రైతులు బాధపడ్డారు. మార్కెట్ యార్డులో టార్పాలిన్లు సకాలంలో ఇవ్వలేదని కొందరు.. ఇప్పటికీ ఇంకా తూకం ప్రారంభంకాలేదని మరికొందరు రైతులు వాపోయారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో ఈ సీజన్లో 497 కేంద్రాలను ఏర్పాటు చేసి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని నిర్ణయించారు. పదిహేను రోజుల కిందటే జిల్లాలో 235 కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఊపందుకోవడం లేదు.
జిల్లాలో మెదక్, చిన్నశంకరంపేట, నర్సాపూర్, రామాయంపేట, చేగుంట, హవేళీఘనపూర్, నిజాంపేట్, కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచెడ్, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో వర్షం కురిసింది. కోతకు వచ్చిన సమయంలో భారీ వర్షానికి వరి పంట నేల కొరగడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వేల క్వింటాళ్లలో ధాన్యాన్ని రైతులు అమ్మేందుకు కొనుగోలు కేంద్రాలకు తెచ్చారు. భారీ వర్షం కురవడంతో ఆ ధాన్యం తడిసి ముద్దయ్యింది. వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.