పటాన్చెరు. అక్టోబర్ 15 : సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ తెలంగాణతో పాటు అనేక రాష్ర్టాల కార్మికులు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. కార్మికులతో పాటు పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు పటాన్చెరులో అప్పటి సీఎం కేసీఆర్ వంద పడకల దవాఖాన నిర్మాణానికి రూ. 188 కోట్లు నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెంటపడి వంద పడకల దవాఖాన భవన నిర్మాణ పనులు పూర్తిచేయించారు. అత్యాధునిక సౌకర్యాలు, కార్పొరేట్ స్థాయిలో సేవలు అందించేలా దవాఖాన నిర్మాణం చేపట్టారు. ఈఎన్టీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్,జనరల్ సర్జరీ, న్యూరోసర్జన్ ఎండోస్కోపి, ఎక్స్‌రే, ఓపీ సేవలు అందించేందుకు ప్రత్యేక గదులు నిర్మించారు.ఆపరేషన్ థియేటర్, ఐసీయూకు ప్రత్యేక వార్డులు సిద్ధం చేశారు.
ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్ సేవలు అందించేందుకు సిద్ధ్దం చేస్తున్నారు. గైనకాలజీ వార్డుకు ప్రత్యేక గదులు నిర్మాణం చేశారు. చిన్నపిల్లల ఈఎస్ఆర్ అత్యవసర విభాగం నియోనేటల్ కేర్ యూనిట్, ఐసీయూ వార్డులు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారు. పటాన్చెరు దవాఖానకు ప్రస్తుతం నిత్యం 1000 నుంచి 1200 వరకు ఓపీ కేసులు నమోదవుతున్నాయి. దవాఖానలో 25 మంది వైద్యులు, 40 మంది హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు పనిచేస్తున్నారు. 8 మంది ఫార్మసిస్టులు , 4 ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. 40 మంది పారిశుధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. కొత్త దవాఖాన అందుబాటులోకి వస్తే కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అంది రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
పటాన్చెరు దవాఖాన భవనంలో వంద యూనిట్ల రక్తం నిల్వ చేసేందుకు వీలుగా బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు రక్తం అందించేందుకు బ్లడ్ బ్యాంకు ఉపయోగపడనున్నది. పటాన్చెరు పారిశ్రామిక వాడ కావడంతో పాటు 65వ జాతీయ రహదారి, ఓఆర్ఆర్ ఉండడంతో అత్యవసర పరిస్థితిలో వైద్యసేవలు అందించేందుకు ఈ దవాఖాన కీలకంగా మారనున్నది. బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేస్తుండడంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అంది క్షతగాత్రుల ప్రాణాలు నిలిచే అవకాశం ఉంది. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంతో అత్యవసరంగా రక్తం లభించక మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి.పారిశ్రామిక ప్రాంతం కావడంతో పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. కొత్త దవాఖాన ప్రారంభిస్తే కార్మికులతో పాటు పేదలకు వైద్యం అంది ప్రాణాలు నిలిచే అవకాశం ఉంది.
పటాన్చెరు దవాఖానకు రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ప్రతి రోజు దవాఖానలో 1200 వరకు ఓపీ నమోదవుతున్నది. వైద్యులు, సిబ్బంది ప్రస్తుత దవాఖానలో ఉన్న సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నాం.కొత్త దవాఖాన భవనం అందుబాటులోకి వస్తే సేవలు మరింతగా అందిస్తాం. కొత్త దవాఖానలో అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. కార్మికులు, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు భవనం నిర్మాణం చేశారు. చిన్న చిన్న పనులు ఉండడంతో కొత్త దవాఖాన ప్రారంభించేందుకు అలస్యం అవుతున్నది. పనులు పూర్తిగానే ప్రభుత్వం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
-డాక్టర్ చంద్రశేఖర్, సూపరింటెండెంట్, ఏరియా దవాఖాన పటాన్చెరు
పటాన్చెరులో కార్మికులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రి హరీశ్‌రావు ఎంతో చొరవ చూపారు. పారిశ్రామిక వాడలు ఉండడంతో కార్మికులు, పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు దవాఖాన నిర్మించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మాణం చేపట్టారు. కార్మికులు, పేదలు బీఆర్ఎస్కు రుణపడి ఉంటారు. కేసీఆర్, హరీశ్‌రావు కలలు గన్న భవన నిర్మాణం ప్రారంభానికి సిద్ధం కావడం సంతోషంగా ఉంది.
-ఆదర్శ్‌రెడ్డి, బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్
పటాన్చెరు ప్రజలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎంతో కృషిచేసి నిధులు మంజూరు చేశారు. ఈ ప్రాంతంలో పేదలు, అనేక రాష్ర్టాల కార్మికులు నివాసం ఉంటారు. వారికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషిచేసింది. వందపడకల దవాఖాన భవనం నిర్మాణం పూర్తి కావడం సంతోషంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఏర్పడింది. పటాన్చెరు ప్రజల పక్షాన కేసీఆర్‌కు, హరీశ్‌రావుకు రుణపడి ఉంటాం.
-మెట్టుకుమార్ యాదవ్, పటాన్చెరు కార్పొరేటర్