మెదక్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో రెండు రోజుల పాటు రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి భారీగా నష్టం చేకూరింది. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. రోడ్లు ఎకడికకడ దెబ్బతిన్నాయి. గ్రామాల మధ్య అనుసంధానం లేకపోవడంతో రాకపోకలు స్తంభించాయి. వరద ఉధృతిలో పల్లెలు జలదిగ్బంధంలో చికుకున్నాయి. మెదక్ జిల్లాలోని మెదక్-మక్తభూపతిపూర్ గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ మండలం మక్తభూపతిపూర్ -రాయిన్‌పల్లి మార్గంలో తిమ్మానగర్ వద్ద రోడ్డు కుంగిపోయి రాకపోకలు స్తంభించాయి.
దీంతో మక్తభూపతిపూర్, తిమ్మానగర్, గుట్టకిందిపల్లి తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ మండలంలోనే అతిపెద్ద చెరువు కొంటూర్ అలుగు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మక్తభూపతిపూర్, తిమ్మానగర్, గుట్టకిందిపల్లి, రాయిన్‌పల్లి, శివ్వాయిపల్లి, వెంకటాపూర్ గ్రామాల ప్రజలు మెదక్ పట్టణానికి వెళ్లాలంటే కొంటూర్ నుంచి వెళ్లాలి. కానీ, కొంటూరు చెరువు అలుగు పారడంతో మెదక్‌కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. హవేళీఘనపూర్ మండలంలో భారీ వర్షాలు కురియడంతో బూర్గుపల్లి, వాడి, రాజ్పేట్, కొత్తపల్లి, కప్రాయిపల్లి, కప్రాయిపల్లి తండా, దూప్‌సింగ్ తండాకు రాకపోకలు రెండు రోజులుగా బంద్ అయ్యాయి.
రాజ్‌పేట బ్రిడ్జి వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూప్‌సింగ్ తండా రెండు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో తండావాసులు సమీపంలోని గుట్టపైనే ఉంటున్నారు. తాగడానికి నీరు, ఆహారం లేక అలమట్టించారు. సహాయక చర్యలు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేట మండలం పర్వతాపూర్-రామాయంపేట మధ్యలో రోడ్డు కల్వర్టు తెగిపోవడంతో అధికారులు దారిని నిలిపివేశారు. నిజాంపేట మల్కచెరువు మత్తడి వద్ద వరద ధాటికి బ్రిడ్జి పూర్తిగా కూలిపోయింది.
మెదక్ జిల్లా హవేళీఘణాపూర్ మండలంలోని రాజ్‌పేట, బూర్గుపల్లి, వాడి, కొత్తపల్లి, కప్రాయిపల్లి, దూప్‌సింగ్ తండాలకు రెండురోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు చీకట్లో గడిపారు. తాగునీటికి అల్లాడుతున్నారు. మెదక్ మండలం రాయిన్పల్లిలో రెండు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మెదక్ జిల్లావ్యాప్తంగా రోడ్లతో పాటు కల్వర్టులు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల రోడ్లు ధ్వంసం కాగా, మరికొన్ని చోట్ల బ్రిడ్జిలు పూర్తిగా కొట్టుకుపోయాయి. జిల్లాలో ధ్వంసమైన, కొట్టుకుపోయిన రోడ్లను పంచాయతీరాజ్ శాఖ అధికారులు పరిశీలించి మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 45 రోడ్లు ఉండగా, అందులో 60 చోట్ల డ్యామేజ్లు అయ్యాయి. రూ.3.99 కోట్లతో మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హవేళీఘణాపూర్ మండలం రాజ్‌పేట బ్రిడ్జి, బ్యాతోల్-లింగ్సాన్‌పల్లి రోడ్డు, మెదక్ నుంచి మక్తభూపతిపూర్ రోడ్డు మధ్యలో ఉన్న బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. మెదక్ మండలం పాతూర్-రాయిన్‌పల్లి వెళ్లే రోడ్డు ధ్వంసమైనట్టు అధికారులు తెలిపారు. ఆర్అండ్బీ రోడ్లు 50 కిలోమీటర్ల మేర దెబ్బతినగా, రూ.2 కోట్లతో మరమ్మతులకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. 12 కల్వర్టులకు ప్యాచ్‌లు దెబ్బతినగా, 7 రోడ్లు కొట్టుకుపోయాయి.
మెదక్ జిల్లాలోని ఘనపూర్ ప్రాజెక్టు, హల్దీ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తుండడంతో పొంగి పొర్లుతున్నాయి. మెదక్-కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని ఉన్న పోచారం ప్రాజెక్టు పొంగుతోంది. మెదక్ జిల్లాలో 2632 చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులు, వాగులు, వంకలకు గండ్లు పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వర్షాల ధాటికి మెదక్ జిల్లాలో పంట లు నీట మునిగాయి. ము ఖ్యంగా ప్రాజెక్టులు, చెరువులు, వాగుల పక్కన సాగు చేసిన పొలాల్లోకి వరద ముంచెత్తింది. ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో దాని కింద సాగు చేసిన పంటలు నీట మునిగాయి. జిల్లాలో ఈ సీజన్లో 3 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, 21 మండలాల్లో 6341 ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.