శుక్రవారం 15 జనవరి 2021
Mancherial - Nov 20, 2020 , 02:59:22

పాడితోనే ఉపాధి

పాడితోనే ఉపాధి

  • పాల ఉత్పత్తిలో ఉమ్మడి జిల్లాను అగ్రభాగాన నిలుపుదాం
  • త్వరలో విజయ పెట్రోల్‌ బంక్‌లు ప్రారంభిస్తాం
  • రాష్ట్ర డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి
  • లక్షెట్టిపేటలో ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభం
   లక్షెట్టిపేట :  పాడి పరిశ్రమతో గ్రామీణ పేదలకు ఉపాధి లభిస్తుందని రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ లోక భూమారెడ్డి పేర్కొన్నారు. లక్షెట్టిపేటలో పాల శీతలీకరణ కేంద్రాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావుతో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పాడి పరిశ్రమ ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రూ.6 కోట్లతో 20 వేల లీటర్ల సామర్థ్యంతో పాలకేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామని వెల్లడించారు.  పాడి పరిశ్రమలో ఉమ్మడి ఆదిలా బాద్‌ను అగ్రభాగాన నిలుపుదామని పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొంది,  వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా గేదెలను కొని ఉపాధి పొందాలని గ్రామీణులకు సూచించారు. 
విజయ డెయిరీ ద్వారా పాలను సేకరించి, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నామని చెప్పారు. త్వరలో విజయ పెట్రోల్‌ బంకులను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరిన్ని పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నల్మాసు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడేటి శ్రీనివాస్‌ గౌడ్‌, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ తిప్పని లింగన్న, మాజీ చైర్మన్‌ కేతిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, డీడీ మధుసూదన్‌, ప్రత్యేక అధికారి మల్లిఖార్జున్‌, మేనేజర్‌ రవికుమార్‌, ప్రవీణ్‌, కౌన్సిలర్లు చాతారాజు రాజన్న, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పాడి రైతులు పాల్గొన్నారు.