మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Mancherial - Aug 12, 2020 , 02:56:46

మీనం.. మురిపెం

మీనం.. మురిపెం

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు 100శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. జిల్లాలో 88 సంఘాలు ఉండగా, అందులో 5731 మంది సభ్యులు ఉన్నారు. ముందస్తు ప్రణాళికలు రూపొందించిన అధికారులు ఈ యేడాది పెద్ద సంఖ్యలో చేపల పెంపకాన్ని చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు.

జిల్లాలో 1.92 కోట్ల చేప పిల్లల పెంపకం

జిల్లాలో ఈ యేఏడాది 1.92 కోట్ల చేప పిల్లలను వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 325 చెరువులు, పలు ప్రాజెక్టుల్లో వీటిని పెంచనున్నారు. బంగారు తీగ, మిగ్రాల్‌, రొయ్య, బొచ్చరవ్వ, చందమామ తదితర రకాలకు చెందిన వాటిని జలాశయాల్లో విడుదల చేయనున్నారు. అదే విధంగా 30 లక్షల రొయ్య పిల్లలను సైతం పెంచనున్నారు. వాస్తవానికి ఈ నెల 5 నుంచి కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో రెండు, మూడు రోజుల్లో ప్రక్రియ మొదలు పెడుతామని అధికారులు వెల్లడించారు.

ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో..

జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి, గొల్లవాగు, నీల్వాయి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ, ముల్కల్ల, రాళ్లవాగు ప్రాజెక్టులతో పాటు చెరువుల్లో చేప పిల్లలను వదులుతారు. వీటి ద్వారా వేలాది మంది కుటుంబాలకు ఉపాధి లభించనున్నది. ముఖ్యంగా గత పాలకుల పట్టింపులేని తనంతో దుర్భర జీవితం గడిపిన మత్స్యకార కుటుంబాలు, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చొరవతో ఆనందంగా జీవిస్తున్నాయి. చేప పిల్లలను కొనాలంటే గతంలో ఎంతో వ్యయ ప్రయాసాలకోర్చి తెచ్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేప పిల్లలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. 

కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణాలు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభు త్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా సొసైటీల్లో సభ్యులైన మత్స్యకారులకు రుణాలను ఇవ్వనున్నది. ముఖ్యంగా చేపల చెరువు తవ్వుకునే వారికి ఒక హెక్టారుకు రూ. లక్షా 31 వేలు, చేపల మార్కెట్‌ చేసుకునే వారికి రూ. 25 వేలు, చేపలు పట్టేవారికి రూ. 30 వేల వరకు రుణాలు ఇవ్వనున్నారు.


logo