మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jun 27, 2020 , 02:25:11

ఏడాదిలోనే చిట్టడవులు

ఏడాదిలోనే చిట్టడవులు

  • అకిరా మియావాకి విధానంలో మినీ ఫారెస్టులు

‘కాకులు దూరని కారడవి.. చీమలు దూరని చిట్టడవి’ అని అరణ్యాల గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పుడు ఆ వనాలను తిరిగి సృష్టించే పనిలో పడింది రాష్ట్ర సర్కారు. ‘అకిరా మియావాకి’ పద్ధతిలో తక్కువ స్థలం, తక్కువ సమయంలోనే మినీ ఫారెస్టులను సృష్టిస్తున్నది. కరీంనగర్‌ సిటీ పోలీస్‌ శిక్షణ కేంద్రంతోపాటు  ఎన్టీపీసీ ఆక్సిడేషన్‌ ప్లాంట్‌ ఆవరణలో చేపట్టిన ఈవిధానం సత్ఫలితాలనిస్తున్నది. నెలల వ్యవధిలోనే మొక్కలు     చిట్టడవుల్లా మారి, ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. - కరీంనగర్‌ క్రైం/ జ్యోతినగర్‌ 

 ఎన్టీపీసీ ఆక్సిడేషన్‌ ప్లాంట్‌ 

ఆరు నెలల క్రితం ఎన్టీపీసీతోపాటు అటవీశాఖ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఆక్సిడేషన్‌ ప్లాంట్‌ ఆవరణలో 53 రకాల మొక్కలు 3,350 నాటారు. అందులో ప్రధానంగా నీడనిచ్చే వేప, జువ్వి చెట్టు, రోజ్‌ వుడ్‌, అశోక, టేకు, పండ్లనిచ్చే జా మ, సీతాఫలం, పులిచింత, దానిమ్మ, ని మ్మ, పనస, మామిడి, ఉసిరి, జీలుగ, జీడితోపాటు మందారం, గులాబీ, బంతి తదితర పూల మొక్కలు పెట్టారు. నిత్యం సేంద్రియ ఎరువులు వేయడంతోపాటు బిందు సేద్యం కింద నీటిని అందిస్తూ వచ్చారు. ఆరు నెలల్లోనే ఆ మొక్కలు బాగా ఎదిగాయి. నగర ప్రజలకు ఆహ్లాదం పంచుతున్నాయి. అందులో జామ, సీతాఫలం మొక్కలు కాతకు కూడా వస్తున్నాయి. 

కరీంనగర్‌ సిటీ పోలీస్  శిక్షణ కేంద్రం..

కరీంనగర్‌ సీపీటీసీ (సిటీ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌) ఆవరణలో విశాలమైన స్థలం ఉండగా, గతేడాది ఎకరం భూమిలో మియావాకి పద్ధతిన పెంపకానికి శ్రీకారం చుట్టారు. వీటి కోసం ఇతర ప్రాంతాల నుంచి సారవంతమైన మట్టిని తెప్పించారు. అన్ని చోట్లా ఎకరానికి నాలుగు వేలలోపు మొక్కలు పెడుతున్నా, ఇక్కడ మాత్రం ప్రయోగాత్మకంగా 12,500 మొక్కలు నాటారు. కానుగ, వేప, అల్లనేరెడు, మామిడి ఇలా 54 రకాలను పెంచారు. వాటికి డ్రిప్‌ ద్వారా నిత్యం నీరందిస్తూ సంరక్షించారు. ఆ మొక్కలు ఐదారు నెలలకే ఏపుగా పెరిగాయి. ప్రస్తుతం చిట్టడవిని తలపిస్తున్నాయి. logo