మక్తల్, అక్టోబర్ 06: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా తెలియజేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజలందరికీ చేరువయ్యేలా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తపై ఉన్నదని దిశానిర్దేశం చేశారు.
సోమవారం మక్తల్ నియోజకవర్గంలోని నర్వా మండల కేంద్రంలో నర్వ మండల పార్టీ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల కార్యకర్తల కార్యాచరణ సమావేశానికి చిట్టెం రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల గ్యారంటీ కార్డు ప్రకారంగా రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన బాకీలన్నింటినీ కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉందన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించిందని చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ విషయాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ కళ్లకు కట్టినట్లుగా వివరించాలన్నారు. రాష్టంలో కాంగ్రెస్ తుగ్లక్ పరిపాలన చేస్తూ, ప్రజందరిని మోసం చేస్తున్న విషయాన్ని తెలియజేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ విజయానికి ఒక సైనికుడిలా పనిచేసి, పార్టీ విజయానికి దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.