ఊట్కూర్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ , నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని పీఓడబ్ల్యూ (POW ) జిల్లా కార్యదర్శి గావినోళ్ల సావిత్రమ్మ, పీవైఎల్ (PYL)జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధు డిమాండ్ చేశారు. సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ( Massline ) పార్టీ పిలుపు మేరకు శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వారం గ్రామంలో సిలిండర్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు. వారు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ ( Narendra Modi ) పేదోళ్లను కొట్టి పెద్దోళ్లకు దోచిపెట్టే విధానాన్ని అవలంభిస్తోందని ఆరోపించారు.
ప్రపంచ వ్యాప్తంగా చమురు, క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. మతం మత్తులో దేశ ప్రజలను మభ్యపెట్టడం, పేదల పొట్ట కొట్టడం బీజేపీ నైజమని ఆరోపించారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ గ్రామ నాయకురాలు శివలీల, పద్మ, లింగమ్మ, గుడిసె నిర్మల, పిరికి రాధమ్మ , వెంకటమ్మ, పీడీఎస్యూ నాయకులు అనీల్, శ్రీకాంత్, భాస్కర్ పాల్గొన్నారు.