అమరచింత, జూన్ 8 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న 99రోజుల ప్రగతిపాలన వార్డు సభల్లో తమకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కావడం లేదని పాలకవర్గ సభ్యులను ప్రజలు జిల్లా స్థాయి అధికారుల ముందే నిలదీశారు. సోమవారం ఆత్మకూర్ మున్సిపాలిటీలోని 4, 5, 10 వార్డుల్లో చైర్పర్సన్ నాగమణి అధ్యక్షతన కమిషనర్ నరేశ్‌కుమార్ వార్డు సభలను నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ కీమ్యానాయిక్ హాజరై మాట్లాడి మహిళా సంఘాల సభ్యులకు మొక్కలను అందజేశారు. వార్డు సభ ముగింపులో మున్సిపల్ కమిషనర్ నరేశ్‌కుమార్ మాట్లాడుతూ వార్డుల్లో చెత్తసేకరణకు వచ్చే సిబ్బందికి తడి, పొడి చెత్తను వేర్వేరు చేసి ఇవ్వాలని చెబుతుండగా, మహిళలు ఒక్కసారిగా లేచి తమ కాలనీలో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని, అసలు తాగునీటి గోస తీర్చారా అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులు విన్నవించినా పట్టించుకోలేదని అదనపు కలెక్టర్ ముందే నిలదీశారు.
మంచినీటి సరఫరాపై మహిళలు నిలదీస్తుండగానే మార్కెట్ కమిటీ చైర్మన్ రహిమాతుల్లాతోపాటు మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాసులు, పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌పార్టీ నాయకులు అర్ధాంతరంగా సభ నుంచి వెళ్లిపోయారు. అమరచింత మున్సిపాలిటీలోని 4, 5 వార్డుల్లో జరిగిన వార్డు సభలకు చైర్పర్సన్ సువర్ణ అధ్యక్షత వహించగా అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ హాజరుకాగా ప్రభుత్వం కొత్తగాఏర్పాటు చేస్తు న్న ప్రైమరీ పాఠశాలను కొత్త ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేయాలని కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు.