జడ్చర్ల, మే 15 : జడ్చర్ల మండలం గంగాపూర్ రోడ్డులోని పత్తి మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు గురువారం జడ్చర్ల-కల్వకర్తి 167వ జాతీయర హదారిపైకి వచ్చి రాస్తారోకో, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యాన్ని తీసుకొచ్చి 15రోజులు గడుస్తున్నా ఇప్పటి వ రకు కొనుగోలు చేయడం లేదని, చెత్త, తేమశాతం పేరుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.
ప్రతిరోజూ ధాన్యాన్ని ఆరబెట్టడం, సాయంత్రం కుప్పవేయడమే సరిపోతుందన్నారు. అకాల వర్షాలకు తడిసి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్తే కిలో నుంచి రెండు కిలోలు తరుగుతీస్తున్నారని, ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే మిల్లర్లు లారీల్లో నుంచి ధాన్యాన్ని దించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు రోడ్డుపై నుంచి కదిలేదిలేదని భీష్మించుకుని కూర్చోవడంతో ప్రధాన రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎస్సై జయప్రసాద్ ధర్నా వద్దకు చేరుకొని అధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.