అమ్రాబాద్, మే 31 : చెంచుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని కలెక్టర్ ఉదయ్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా చెంచులక్ష్మి హోటల్, మ్యూజియాన్ని పరిశీలించి వాటిని త్వరలోనే పునరుద్ధరించి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదేవిధంగా 100 మంది చెంచులకు ఉపాధి అందించడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యాపార సముదాయాన్ని నిర్మిస్తామని చెప్పారు. చెంచుల సమస్యలను శాశ్వతంగా దూరం చేసేందుకు పూర్తిస్థాయి ఐటీడీఏ కార్యాలయాన్ని మన్ననూర్‌లో ఏర్పాటు చేస్తామన్నారు.
అనంతరం శానిటరీ నాప్కిన్ కేంద్రాన్ని పరిశీలించగా.. యంత్రాలు పనిచేయడం లేదని చెంచు మహిళలు తెలిపారు. దీంతో భద్రాచలంలో నడిచే నాప్కిన్ కేంద్రం మాదిరిగా ఈ యంత్రాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో ఉన్న పీటీజీ గురుకుల ఆర్సీవో కార్యాలయాన్ని మన్ననూర్‌కు తీసుకొస్తామన్నారు. తాగునీరు, విద్యుత్, వ్యవసాయ, వ్యవసాయేతర తదితర సమస్యలపై కలెక్టర్ ఇచ్చిన నివేదికను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్చార్జి పీవో రోహిత్‌గోపిడి, డీటీడీవో కమలాకర్‌రెడ్డి, జీసీసీ మేనేజర్ సంతోష్, ఇంజినీరింగ్‌శాఖ డీఈ వెంకటేశ్వరసింగ్, తాసీల్దార్ సరిత, అధికారులు పాల్గొన్నారు.