కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగానే పాత రోజులు మళ్లా తీసుకొచ్చారు.. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వారం, పది రోజులకోసారి తాగునీటి సరఫరా జరిగేది. దీంతో నీళ్లకోసం యుద్ధం చేసేటోళ్లు.. ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని రోడ్లపైకి వచ్చేటోళ్లు.. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక నాటి సీఎం కేసీఆర్ బృహత్తర పథకమైన మిషన్ భగీరథను చేపట్టి ఇంటింటికీ శుద్ధమైన మంచినీటిని నల్లాల ద్వారా ఇంటింటికీ సరఫరా చేశారు. దీంతో నీటి ఎద్దడి తీరిపోయి పుష్కలంగా కృష్ణా జలాలు అందాయి.
కానీ రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మళ్లా నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుత వేసవిలో ఖాళీ బిందెలు పట్టుకొని మహిళలు రోడ్లెక్కుతున్నారు. ట్యాంకర్లు, బోర్లను ఆశ్రయించి సైకిళ్లు, వాహనాలపై బిందెలు పెట్టుకొని తెచ్చుకుంటున్నారు. తాజాగా పాలమూరు జిల్లా కేంద్రంలోని బోయపల్లి ఎస్సీ కాలనీలో వారం రోజులుగా నీటి కోసం స్థానికులు అలమటిస్తున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో.. గురువారం ట్యాంకర్ రాగానే ఒక్కసారిగా స్థానికులు ఎగబడ్డారు. అయితే స్థానికులకు నీళ్లు మాత్రం సరిపోలేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాబోయే మే నెలలో పరిస్థితి ఏమిటని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
– బందిగె గోపి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబ్నగర్