గద్వాల, మార్చి 16 : ఉమ్మడి జిల్లాకు వర ప్రదాయినిగా ఉన్న జూరాల ప్రాజెక్టులో రోజురోజుకు నీరు ఇంకిపోతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు పరిధిలో పంటలు సాగు చేసిన రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు వారబంధి ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడుతామని అధికారులు చెబుతున్నా ప్రస్తుతం జలాశయా ల్లో నీరింకి పోతుండడంతో అధికారుల మాటలు రైతులు నమ్మే పరిస్థితిలో లేరు.
యాసంగిలో 5 టీఎంసీల నీటిని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరగా, 4టీఎంసీలు విడుదల చేయడానికి అంగీకరించినట్లు ఇక్కడి మంత్రితోపాటు ఎమ్మెల్యేలు చెప్పారు. అయి తే ఇప్పటి వరకు కర్ణాటక ప్రభుత్వం కేవలం 0.45 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేసింది. మిగ తా నీటిని విడుదల చేస్తే తప్పా ప్రస్తుత పరిస్థితుల్లో పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేక జూరాల ప్రాజెక్టు పరిధిలో రైతులు క్రాఫ్హాలిడే ప్రకటించారు. చేతికొచ్చిన పంటలు ఎండుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మోటర్లను బంద్ చేయిస్తే దిగువకు నీరు వచ్చి మా పంటలు పండుతాయని రైతులు వేడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
జూరాల ప్రాజెక్టు పరిధిలో యాసంగిలో వివిధ లిప్ట్‌ల కింద ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేస్తామని ఎత్తిపోతల వారీగా ఆయకట్టు వివరాలు ప్రకటించారు. జూరాల ప్రాజెక్టు పరిధిలో కుడి, ఎడమ కాల్వల కింద 34,346 ఎకరాలు, నెట్టెంపాడ్ కింద 24,800, బీమా కింద 29,000, కోయిల్‌సాగర్ కింద 8వేల ఎకరాలకు వారబంధి పద్ధతిలో నీటిని ఏప్రిల్ 15వ తేదీ వరకు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 0.911(లైవ్)టీఎంసీల నీరు ఉన్నది.
ర్యాలంపాడ్ 4టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా, లీకేజీల కారణంగా ప్రస్తుతం 1టీఎంసీ నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితిలో ఉండడంతో ఈ ప్రభావం పంటలపై పడుతున్నది. పంటలు చేతికి రావాలంటే కర్ణాటక నుంచి కనీసం 1.2టీఎంసీల నుంచి 2టీఎంసీల నీటిని విడుదల చేస్తే తప్పా కాపాడలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా మంత్రితోపాటు ఎమ్మెల్యేలు మరోసారి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేస్తే పంటలు చేతికొచ్చే పరిస్థితి ఉన్నది. ఆ దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారు లు ప్రయత్నాలు చేయాలని రైతులు వేడుకొంటున్నారు.