ఎన్నికల్లో గట్టెక్కేందుకే కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు చేస్తున్నదని వెల్లడైంది. వ్యవసాయమే తెలియని టీపీసీసీ చీఫ్ రేవంత్
రెడ్డి చేస్తున్న హామీలు బూటకమని తేలింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైతుబంధుపై ఆయన చేసిన వ్యాఖ్యలు
విమర్శలకు దారి తీశాయి. అర్హులందరికీ రైతుబంధు అంటూ ఎన్నికలకు ముందు స్పష్టం చేయగా.. తీరా పోలింగ్ దగ్గర
పడుతుండగా కౌలు రైతులు, భూ యజమానుల్లో ఒక్కరికే పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించడం తీవ్ర దుమారాన్ని రేపుతు
న్నాయి. దీంతో రైతుల నుంచి ఆగ్రహం పెల్లుబికింది. ఇబ్బందుల పాలు చేయాలని చూస్తే సహించేది లేదని కన్నెర్ర చేస్తున్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ జిమ్మిక్కులు, అమలు కాని, మోసపూరిత వాగ్ధానా లపై ప్రజల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే 3 గంటల కరెంట్ చాలని, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని మాట్లాడి విమర్శల పాలు అయిన విషయం తెలిసిందే. భూమి పుత్రులతోపాటు ప్రజలు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు సైతం తప్పుబడుతున్నారు. హస్తం పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంకానున్నారు.
నాగర్‌కర్నూల్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ మోసపోరిత మాటలు, ఎన్నికల్లో గట్టెక్కేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న హామీలు అమలుకు సాధ్యం కానివని తేలింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రైతుబంధుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు రైతన్నల్లో, ప్రజల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నాయి. అర్హులందరికీ రైతుబంధు అంటూ ఈ ఎన్నికలకు ముందు ఆయన స్పష్టం చేశారు. తీరా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కౌలు రైతులు, భూ యజమానుల్లో ఒకరికే ఇస్తామంటూ ప్రకటించడం గమనార్హం. ఓట్ల కోసం కాంగ్రెస్ చేసే ఎన్నికల జిమ్మిక్కులు, అమలు కాని, మోసపూరిత వాగ్ధానాలుగా ప్రజల్లో చర్చ మొదలైంది. రైతులకు 24 గంటల విద్యుత్ విషయంలోనూ రేవంత్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కేవలం 3 గంటల విద్యుత్ చాలంటూ అమెరికాలో చేసిన వ్యాఖ్యలకు తోడుగా రైతులకు అన్ని విధాలా మేలు చేస్తున్న ధరణి పథకాన్ని రద్దు చేస్తామనడం విమర్శలకు దారి తీస్తున్నది. ధరణితో రైతులకు రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్ల డబ్బులు, భూముల రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరుగుతున్నాయి.
ఇలా రైతులపై ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను నీరుగార్చేలా రేవంత్ తీరు ఉండంపై కన్నెర్ర చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచారు. వచ్చే ఎన్నికల్లో గెలిచాక ఏడాదికోసారి రాబోయే ఐదేళ్ల కాలంలో రూ.16 వేలకు పెంచుతూ మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. కాగారైతులకు నిరంతర విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు పూర్తి చేయకుండా, సకాలంలో ఎరువులు, విత్తనాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతుల ఆకలి చావులు, రోజుల తరబడి వాటి కోసం పడిగాపులు కాసే పరిస్థితులు కాంగ్రెస్ పాలనలో అందరికీ అనుభవమే. అలాంటి రైతు వ్యతిరేక కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నది. ఇక వ్యవసాయమే తెలియని రేవంత్‌రెడ్డి తాజాగా రైతుబంధుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైతన్నలతో పాటుగా ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు సైతం తప్పుబడుతున్నారు. ఈ మాటలతో కాంగ్రెస్‌కు తాజా ఎన్నికల్లో రైతులు బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు.
కాంగ్రెసోళ్లకు ఎందుకు అంత ఊరుకులాట అర్థం కావడం లేదు.. వారి పాలనలో ఒక్కనాడైనా తండా దిక్కు చూశారా..? మేము ఎట్లా బతుకుతామనేది పట్టించుకోలేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ సీఎం అయ్యాక మా తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిండు. ఎంతో మంచిగా బతుకుతున్నాం. ఇంటికాడికే తాగునీరు వస్తుంది.. నీళ్లు ఫుల్లుగా ఉండడంతో పంటలు పండుతున్నాయి. సారోళ్లు వస్తుండ్రు పోతుండ్రు.. మాకు ఏం బాధ ఉన్నా చెప్పుకునేందుకు అందరూ ఉన్నారు అనుకుంటున్నాం. ఇప్పటికే చాలా బాగా జీవిస్తున్నాం. మమ్మళ్లి పాత కాలంలాగా ఆగం పట్టించేందుకు చేయి గుర్తోళ్లు ఏమేమో చెబుతున్నారు. వాళ్లు ఏమీ చేయరు. అంతా ఉత్త మాటలే. అది చేస్తాం.. ఇది చేస్తామని ఆగం ఆగం చేస్తున్నారు. వారి మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. కాంగ్రెస్‌పార్టీలో ఎప్పుడూ గొడవలే ఉంటాయి. వాళ్లకే పడకుంటే మా గురించి ఎట్లా పట్టించుకుంటరు. మా గురించి నిత్యం ఆలోచిస్తున్న బీఆర్ఎస్ సర్కారు మా ఓటు.
రైతులు, కౌలుదారులకు మంచిగా చేస్తామని మాటలు చెప్పడం కాదు. అది ఆచరణలోకి రావాలంటే మంచి మనస్సు కూడా ఉండాలి. ఎలక్షన్ వచ్చింది.. ఏదో చెబుతాం అంటే కుదరదు.. కాంగ్రెసోళ్లను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేదు. కౌలుదారులకు రైతుబంధు ఇస్తాం.. ఇయ్యం అంటూ రెండు నాల్కల ధోరణిలో ఉన్నాడు. ముందేంచేస్తరోననేది గిప్పుడే తెలిసిపాయే. రేవంత్‌రెడ్డి ఏం చెబుతున్నాడో.. ఏం అంటున్నారో అర్థం కావడం లేదు. కౌలుదారులకే డబ్బులు ఇస్తామంటే భూమి అసలుదారులు ఒప్పుకుంటారా? గిది కూడా తెలువకపోతే ఎలా? కాంగ్రెసోళ్లు చాలా ఏండ్లు ఏలిండ్రు కదా.. గప్పుడు మా గోస ఎవరూ పట్టించుకోలే. ఏం చేస్తారో.. ఏం చేయరో.. వారికే తెలవడం లేదు. ఇంకేం చేస్తారు చెప్పండి. గిప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో ఎంతో మంచిగా బతుకుతున్నాం. మమల్ని మళ్లీ రోడ్డున పడేసేందుకు కుట్రలు పనున్నతున్నారు. వారి ముచ్చటలు విని వారి వెంట జెండాలు మోసే ఆలోచన కూడా రైతులు చేయడం లేదు. మళ్లా కేసీఆర్ సీఎం కావాలి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనే ఆలోచననే భయమైతున్నది. ఎందుకంటే రైతుబంధుపై వారు చేసే ప్రకటనను, వారి ఆలోచన చూస్తేనే హడల్ పుట్టిస్తున్నది.భూమి ఉన్న వారికి రైతుబంధు ఇస్తే కౌలు రైతులకు ఇవ్వరంట.. కౌలు రైతులకు ఇస్తే భూమి పట్టా ఉన్న యజమానికి ఇవ్వరంట.. కాంగ్రెస్ గెలవదు కానీ.. తప్పిదారి గెలిస్తే వారి పరిపాలన ఎలా ఉంటుందో ఈ రోజు రేవంత్‌రెడ్డి మాటలతో అర్థం అవుతుంది. రైతుబంధు ఆగిపోతే పెట్టుబడి సాయం కష్టం అవుతుంది. కాంగ్రెస్ వస్తే అన్నింటికీ కోతలే ఏర్పడే అవకాశం ఉంది. మాకు నాలుగు కిలోమీటర్లు దాటితే కర్ణాటక రాష్ట్రం గ్రామాలు ఉన్నాయి. పరిచయస్తులు, బంధువులు ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ సరిగ్గా లేదంటున్నారు. మనకు కూడా అదే గతి పడుతుంది.
రేవంత్‌రెడ్డి ఓట్లు దండుకోవడానికే పూటకో మాట మాట్లాడుతున్నడు. కౌలు రైతులకు, అనుభవదారులకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేస్తామని చెబుతూనే రైతుబంధు అసలు యజమానికి వస్తే కౌలు రైతుకు రాదంటున్నరు. కొన్ని రోజుల ముందు కౌలు రైతులకు రైతుబంధు ఇచ్చేలా చర్యలు తీసుకుంటమని చెప్పిండ్రు. ఇప్పుడేమో ఒకరికి వస్తే ఒకరికి రాదంటున్నారు. రైతుల ఓట్లు దండుకోవడానికి అవగాహన లేకుండా నోటికొచ్చింది మాట్లాడుతున్నరు. ఎన్నికలు జరగలే. కాంగ్రెసోళ్లు గెలవనే లేదు.. పూటకోమాట చెబుతున్నరు. ప్రజలు వారి మాటలు నమ్మి ఓటేస్తే ఆగం కావాల్సిందే. రైతుబంధు భూ యజమానికి వస్తే కౌలు రైతుకు రాదని మాకు తెలుసు. అలాంటప్పుడు కౌలు రైతులను మభ్యపెట్టడం ఎందుకు? పోయేకాలం వచ్చినప్పుడు ఇట్లనే మాట్లాడుతరు.
తమ భూములను కౌలుకు ఇచ్చిన వారికి రైతుబంధు డబ్బులు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. రైతులు తమ కుటుంబాల నేపథ్యంలో భూములను కౌలుకు ఇస్తారు. అలాంటప్పుడు రైతుబంధు డబ్బులను యజమానికి కాకుండా కౌలుదారుడికి ఇస్తామనడం ఎంత వరకు సమంజసం. కొన్నేండ్ల తర్వాత రైతుబీమా కూడా వారికే ఇస్తమంటారు. చివరకు భూమి కూడా కౌలురైతులకే అనే పరిస్థితి వస్తుంది. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వానకాలం, యాసంగి సీజన్లో పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారు. అది కూడా ఏటా పెంచుతామంటున్నారు. అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే రైతులు మళ్లీ గెలిపించుకోవాలి.
భూమి యజమాని, కౌలు రైతులకూ రైతుబంధు ఇస్తామని మొదట చెప్పినా తర్వాత మాట మార్చడం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికే చెల్లింది.. మాట మార్చడం ఆయన నైజం. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇస్తున్నా.. తర్వాత నిలబెట్టుకోవడం లేదు. రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారు. రైతులను మరోసారి మోసం చేయాలని చూస్తున్న వారి కుట్రలు పటాపంచలు అయ్యాయి. ఓట్లను డబ్బాలో వేయకముందే రేవంత్‌కు రైతులపై ఉన్న ప్రేమ అర్థమైంది. కర్షకుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, ఇవ్వని హామీ సైతం నెరవేర్చి రైతుబాంధవుడయ్యారు. కానీ హస్తం పార్టీ మాత్రం మాట మార్చే ప్రయత్నం చేస్తున్నది. పూటకో మాట మాట్లాడుతూ పబ్బం గడుపుతున్న కాంగ్రెస్‌కు రైతులే గుణపాఠం చెప్పాలి. కౌలు రైతులను మోసం చేసేందుకు ఆ పార్టీ పని గట్టుకున్నది. కాంగ్రెస్‌కు మాయమాటలు, వాగ్ధానాలకు మోసపోవద్దు..
కాంగ్రెస్ నాయకులు ప్రకటిస్తున్న హామీలతో రైతుల్లో భయం కలుగుతుంది. కౌలు రైతుల కోసం కొత్త చట్టం తీసుకొచ్చి వారి పేర్లను రికార్డు చేస్తామనడం పట్టాదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధును భూమి యాజమాని లేదా కౌలు రైతు ఎవరికో ఒక్కరికే ఇస్తామనడం సమంజసం కాదు. కాంగ్రెసోళ్లు చేస్తున్న ప్రకటనలతో భూమి యాజమానులు ఎవరూ తమ భూములను కౌలుకి ఇవ్వరు. గతంలో ఏ యాజమాని కూడా కౌలు రైతుతో రాత పూర్వకంగా ఒప్పందం చేసుకోలేదు. కౌలు చేసే వారి పేర్లను భూ రికార్డుల్లో ఎక్కిస్తే భవిష్యత్‌లో సమస్యలు వస్తాయి. కాంగ్రెస్ నాయకుల ప్రకటనలతో భూమి యాజమానులకు, కౌలు రైతుల మధ్య దూరం పెరుగుతుంది.
పంట పెట్టుబడికి రైతులు పడుతున్న కష్టాలను కళ్లారా చూసిన సీఎం కేసీఆర్ రైతుబంధు ద్వారా ప్రతి ఏటా రెండు పంటలకు రూ.10వేల చొప్పున అందిస్తుండటంతో సన్న, చిన్నకారు రైతులకు ఆర్థిక భరోసా లభించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూ యజమాని, కౌలు రైతులకు రైతుబంధును అమలు చేస్తమని మ్యానిఫెస్టోలో ప్రక టించారు. ఎన్నికలకు ముందే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట మార్చడం చూస్తుంటే రైతులపై ఎలాంటి చిత్త శుద్ధి లేదనేది స్పష్టమవుతున్నది. కాంగ్రెసోళ్లకు మాట మార్చడం కొత్తేమీకాదు. ఇన్నేండ్ల కరువుకు కారణమే కాంగ్రెస్. అలాంటి పార్టీని నమ్మి ఓటేస్తే మళ్లీ కష్టాలు తప్పవు.
రైతుబంధుపై మాట మార్చిన రేవంత్‌రెడ్డికి రైతులు ఓటుతో బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులు అప్పుల పాలు కావాల్సి వస్తుంది. ఎన్నికలకు ముందే భూమి యజామానికి ఇస్తే కౌ లు రైతుకు రైతుబంధు ఇచ్చేది లేదని రేవంత్‌రెడ్డి మాట మార్చి రైతులను మోసం చేసిండు. రేవంత్‌రెడ్డి ప్రకటనతో కాంగ్రెస్ హామీలు అన్ని బూటకమేనని మరోసారి రుజువైంది. రైతుబంధుపై మాట మార్చిన కాంగ్రెస్‌కు రైతులు గుణపాఠం చెప్పాలి. అధికార దాహంతో రేంవత్‌రెడ్డి పచ్చి అబద్ధాల చెబుతున్నాడు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమాభివృద్ధి కోసం ముందు చూపుతో రైతు బంధుకు శ్రీకారం చుట్టిండు. సీఎం కేసీఆర్ ఉంటేనే రైతులకు మేలు జరుగుతుంది. కేసీఆర్ కే నా ఓటు.
రైతుబంధును భూమి యజమాని లేదా కౌలు రైతు ఎవరో ఒకరికే ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికావు. పూటకో మాటమాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడమే ఆయన పని.. ఆయన ప్రకటనతో కాంగ్రెస్ హామీలన్నీ వట్టి బూటకమే.. ఓట్ల ముందుకోమాట.. తర్వాత మరో మాట మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ మాటలను రైతులు నమ్మే స్థితిలో లేరు. కౌలుదారుకు రైతుబంధు ఇస్తే భూములు కౌలికిచ్చే వారు ఇక దొరకరు. దీంతో సాగు విస్తీర్ణం కూడా తగ్గే అవకాశం ఉన్నది. పట్టాదారుకు కాకుండా కౌలు దారులకు రైతుబంధు ఇస్తే పంచాయితీలు తప్పవు. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల రాజకీయం చేస్తూ లబ్ధిపొందాలని చూస్తున్నారు. ప్రజలు వీరి మాటలు నమ్మే స్థితిలో లేరు. కౌలుదారుల మీద కాంగ్రెస్ వారికి అంత అభిమానం ఉంటే ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందిస్తే సరిపోతది.