ఆత్మకూర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చావు నోట్లో తలపెట్టి 26 రోజులపాటు ఆమరనిరాహారదీక్ష చేసిన తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రతిఒక్కరు ఖండించాలని ఆత్మకూర్ (Atmakur ) బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ (Ravikumar Yadav) అన్నారు. శాసనసభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని అకారణంగా శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆత్మకూరులో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. తక్షణమే కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మాజీ ఎంపీపీ శ్రీధర్ గౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు చిన్నయ్య, రామకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు రియాజ్ అలీ, సీనియర్ నాయకులు మాసన్న, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.