విద్యాశాఖ గాడితప్పింది. మరోసారి నిబంధనలకు పాతరేసి, ఇష్టానుసారంగా వ్యవహరించింది. విదేశాల్లో శిక్షణ కోసం ఉపాధ్యాయులను ఎంపిక చేసిన జాబితే అందుకు అద్దం పడుతున్నది. ఎంపిక విషయంలో సర్కారు నుంచి స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నా, ఎస్జీటీల కేటగిరీ టీచర్లకు రిక్తహస్తం చూపింది. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ ఎంపిక విషయంలోనూ అనేక లుకలుకలు కనిపిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖలో పనిచేసే ఓ అధికారి అందులో కీలక చక్రం తిప్పి, అనర్హులకు పెద్దపీట వేశారన్న విమర్శలు వస్తున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి అనర్హులకు అవకాశం కల్పించడంలో సదరు అధికారి పోషించిన పాత్రపై ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఎంపిక ప్రక్రియలోనూ ఏకపక్షంగా వ్యవహరించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పెంచాలన్న నిర్ణయంలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులను విదేశాలకు పంపి, కొన్ని వారాల పాటు శిక్షణ ఇప్పించడానికి రాష్ట్ర విద్యాశాఖ తాజాగా సిద్ధమైంది. ఆ మేరకు టీచర్లను విదేశాలకు పంపి, అక్కడి విద్యా ప్రమాణాలపై అధ్యయనం చేయించి, ఆ స్థాయి విద్యను మన వద్ద అమలు చేసేందుకు ఓ కార్యాచరణ రూపొందించింది. ప్రధానంగా ఒత్తిడి లేని చదువును అందించడంలో పేరొందిన ఫిన్లాండ్ దేశంతోపాటు అమెరికా, ఫ్రాన్స్, యూకే, సింగపూర్ తదిరత దేశాలకు పంపాలని భావిస్తున్నది.
అక్కడ ప్రముఖ వర్సిటీల్లో శిక్షణ పొందడంతోపాటు విద్యావ్యవస్థను పరిశీలించి, ఉత్తమ విధానాలను గుర్తించేలా.. నైపుణ్యాలను పెంచుకునేలా ఎస్సీఈఆర్టీ యంత్రాంగం అందుకు సంబంధించిన విధివిధానాలు, ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నది. అందులో భాగంగానే ప్రతి జిల్లా నుంచి ఏటా కొంతమందిని విదేశాలకు పంపించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలో జిల్లాల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీల నుంచి ఉపాధ్యాయులను ఎంపిక చేయడానికి మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రతి జిల్లా నుంచి ముగ్గురిని ఎంపిక చేయాలని పేర్కొన్నది. నిబంధనల ప్రకారం చూస్తే.. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) లేదా తత్సమాన కేటగిరి నుంచి ఒక ఉపాధ్యాయుడు, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) లేదా తత్సమాన కేటగిరి నుంచి ఒకరు, జీహెచ్ఎం లేదా తత్సమాన కేటగిరి నుంచి ఒకరిని.. మొత్తంగా ముగ్గురిని ఎంపిక చేయాలని సూచించింది.
ఎస్జీటీలకు రిక్తహస్తం
బోధనరంగంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)లదే పైచేయి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఎక్కువ మంది వీరే ఉంటారు. పల్లె నుంచి పట్నం వరకు ఉండే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుంటారు. ప్రాథమిక విద్యారంగంలో వీరి పాత్ర కీలకం. అందుకే ప్రభుత్వం కూడా ఎస్జీటీలు లేదా అందుకు తత్సమాన కేటగిరి నుంచి ఒకరిని తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ, కరీంనగర్ జిల్లా విద్యాశాఖ మాత్రం ఈ విషయాన్ని విస్మరించింది. వందలాది మంది ఎస్జీటీలు అందుకు తత్సమాన ఉపాధ్యాయులున్నా ఈ కోటా నుంచి ఒక్కరినీ ఎంపిక చేయలేదు. వీరి స్థానంలో స్కూల్ అసిస్టెంట్ తత్సమాన ఉపాధ్యాయులకు అవకాశం కల్పించారు. దీంతో ఎస్జీటీలు భగ్గమంటున్నారు. అంటే విదేశీ శిక్షణ తీసుకునే అర్హత జిల్లాలోని ఎస్జీటీలు, తత్సమాన ఉపాధ్యాయులకు లేదని విద్యాశాఖ భావిస్తున్నదా..? ప్రభుత్వ ఉత్తర్వులున్నా.. పక్కన పెట్టడం అందులో ఒక భాగమేనా..? జిల్లా విద్యాశాఖ ఆలోచన ఏమిటీ? అన్న విషయంపై ప్రస్తుతం సంబంధిత ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతున్నది.
ఇది ఎస్జీటీల్లో ప్రస్తుతం హాట్టాఫిక్లా మారింది. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అవకాశం కల్పించి, ఒక్క కరీంనగర్ జిల్లాలో మాత్రం పక్కన పెట్టడం ఏంటన్న ప్రశ్న వారి నుంచి ఉత్పన్నం అవుతున్నది. తాము అర్హులం కాదా..? తమకు విదేశాల్లో శిక్షణ పొందే సామర్థ్యం లేదా..? అధికారులు తేల్చి చెప్పాలన్న డిమాండ్ వస్తున్నది. మరోప్రాధాన్యత అంశం ఏమిటంటే ఎస్జీటీలను ఎంపిక చేయని పక్షంలో కనీసం అందుకు తత్సమాన కేటగిరి నుంచైనా ఎంపిక చేయాలని సర్కారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. వాటిని కూడా తుంగలో తొక్కి, వీరి స్థానంలో స్కూల్ అసిస్టెంట్ తత్సమాన ఉపాధ్యాయులకు అవకాశం కల్పించడం విమర్శలకు తావిస్తున్నది.
ఎస్ఏ ఎంపిక విషయంలోనూ..
స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) లేదా తత్సమాన కేటగిరిలోనూ ఒకరిని ఎంపిక చేయాలనే నిబంధన ఉన్నది. కానీ, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లను ఎంపిక చేయకుండా తత్సమాన కేటగిరిలో ఇద్దరిని ఎంపిక చేశారు. అంటే ఎస్జీటీలను ఎంపిక చేయాల్సిన స్థానాన్ని కూడా ఈ కేటగిరి నుంచే భర్తీ చేశారు. అయితే, ఇక్కడ లుకలుకలు కనిపిస్తున్నాయి. ఎస్జీటీల తర్వాత బోధనరంగంలో అత్యధికంగా కనిపించేది స్కూల్ అసిస్టెంట్లే. అయితే జిల్లా విద్యాశాఖ నేరుగా స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేసే వారిని ఎంపిక చేయలేదు. కానీ, తత్సమాన స్థాయిలో ఇద్దరికి అవకాశం కల్పించింది. కానీ, ఒక్క స్కూల్ అసిస్టెంట్‌ను కూడా ఎంపిక చేయలేదు. అంటే వివిధ సబ్జెక్టులు బోధించే స్కూల్ అసిస్టెంట్లకు విదేశాలకు వెళ్లే అర్హత లేదని విద్యాశాఖ భావిస్తుందా..? అన్న చర్చ ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లలోనూ నడుస్తున్నది.
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన?
విదేశాల్లో శిక్షణ కోసం ఎంపిక చేసే ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రధానంగా ఎంపిక చేసే ఉపాధ్యాయుడికి చెల్లుబాటయ్యే పాస్‌పోర్ట్ ఉండాలి. కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. 55 సంవత్సరాలలోపు వయసు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేకపోవడం, ఎటువంటి చార్జ్‌షీట్, ఎంక్వైరీ, చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉండరాదని సూచించింది. కానీ, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన కేటగిరిలో ఎంపిక చేసిన ఓ ఉపాధ్యాయుడిపై జిల్లా విద్యాశాఖలో చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇటువంటి వారిని ఎంపిక చేయడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. గత మూడేళ్లలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు చేసిన కృషిని అతని పై అధికారి ధ్రువీకరించాలి. అలాగే గడిచిన మూడేళ్లలో విద్యార్థుల నమోదు పెంపుగా ఉండాలి. కానీ, ఇప్పుడు ఎంపిక చేసిన ఓ ఉపాధ్యాయుడి పాఠశాలలో మూడేళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగకపోగా, క్రమంగా తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తున్నది.
పాఠ్యపుస్తక రచన, మాడ్యూల్ అభివృద్ధి, రాష్ట్ర, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్ సేవలు వంటి అంశాలలో ఎటువంటి ప్రత్యేక సేవలు లేవు. విద్యా ఆవిష్కరణలు అంశానికి వస్తే.. బోధనలో నూతన ఆవిష్కరణలు చేసిన ఆధారాలు లేవు. భావ వ్యక్తీకరణ, సంసిద్ధతకు సంబంధించి ఆంగ్ల భాషలో సంభాషణ నైపుణ్యం, అంతర్జాతీయ విద్యా విధానాలపై అవగాహన వంటి అంశాలను ప్యానల్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా నిర్ధారించాలి. కరీంనగర్ జిల్లాలో ఈ విధానం పాటించిన దాఖలాలు లేవు. డైరెక్టర్ ఆదేశాల ప్రకారం అర్హతలు కలిగిన ఉపాధ్యాయులను జిల్లా స్థాయిలో పారదర్శకంగా ఎంపిక చేయడంతోపాటు వారు గతంలో అందించిన సేవలు, అర్హతలకు సంబంధించి పూర్తి డాక్యుమెంటరీ ఆధారాలతో కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి ఎంపిక కమిటీకి సమర్పించాలి. ఆ కమిటీ ఎంపిక చేసిన ముగ్గురి ప్రతిపాదనలు పూర్తి ఆధారాలతో రాష్ట్ర స్థాయికి పంపించాలి. కానీ, జిల్లాలో ఈ ఎంపికకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతున్నది. విద్యాశాఖలో పనిచేసే ఓ అధికారి ఈ విషయంలో చక్రం తిప్పారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఎంపిక విధానంపై పూర్తి వివరాలు ఆరా తీస్తే.. అర్హత ఉన్న ఉపాధ్యాయులకు న్యాయం జరగడంతోపాటు చక్రం తిప్పిన అధికారి అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.