పెబ్బేరు, ఏప్రిల్ 21 : ప్రమాదవశాత్తు పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఓమిని కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు శివారు హైవే-44పై సమీపంలోని చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని కుత్బుల్లాపూర్ జిల్లా బాగేపల్లికి చెందిన రాజ్కుమార్రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి రెండు నెలల కిందట వివాహమైంది.
బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు భారతి, వెంకటమ్మ, నారాయణరెడ్డి, లక్ష్మీదేవమ్మ, నాగరత్నమ్మ, రామలక్ష్మి, వెంటలక్ష్మితో కలిసి రాజ్కుమార్రెడ్డి ఓమిని కారులో కర్ణాటక నుంచి హైదరాబాద్కు బయలుదేరాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పెబ్బేరుకు సమీపంలోకి కారు రాగానే నిద్రమత్తులోకి రాజ్కుమార్రెడ్డి జారుకోవడంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులోని ప్రయాణికులు అప్రమత్తమై బయటకు వచ్చారు. వెంకటమ్మకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. కారు మంటల్లో దగ్ధమైంది.