నారాయణపేటటౌన్, జూలై 28 : నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతుల చేత బలవంతంగా ప్రలోభాలతో మోసంతో భూ సేకరణ చేయవద్దని, 2013 భూ సేకరణ చట్టప్రకారం న్యాయమైన పరిహారం అందించి ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ పార్ నుంచి భూ నిర్వాసితులు పట్టణ కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. అయితే శాసన్‌పల్లి రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో అకడే రోడ్డుపై బైఠాయించి మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు.
ఆర్డీవో రామచందర్ రైతులను బెదిరించడం సరి కాదని అన్నారు. బహిరంగ మారెట్ ధరకు అనుగుణంగా బేసిక్ ధరను నిర్ణయించి 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పరిధిలో భూమిని కోల్పోతున్న దాదాపు 20గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని అన్యాయంగా ప్రభుత్వం సేకరించవద్దని తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, మశ్ఛేందర్ మాట్లాడుతూ రైతులకు న్యాయమైన పరిహారం అందేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. రైతులను ప్రలోభపరిచి మోసగించో కొద్దిమంది భూ నిర్వాసితుల చేతిలో చెకులు పెట్టి ఇక మేము ఇస్తున్నామంటూ ఆర్భాటాలు చేయడం సరైంది కాదన్నారు .
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతుకు బహిరంగ మారెట్ ధర కనుగుణంగా న్యాయమైన పరిహారం అందించాలని సూచించారు. అన్ని విధాలుగా వెనుకబాటుకు గురైన నారాయణపేట జిల్లాకు ప్రాజెక్టు తప్పనిసరి అవసరమని మన ప్రాంతానికి నీళ్లు అవసరమని అదే సమయంలో భూనిర్వాసితులకు కూడా సరైన న్యాయం చెల్లించాలని కోరుతున్నామన్నారు. గత 14 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఈ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి మద్దతుగా వచ్చిన పాలమూరు అధ్యాయన వేదిక కన్వీనర్ రాఘవాచారి మద్దతు తెలిపి మాట్లాడారు.
కలెక్టర్ ధర్నా దగ్గరకు రావాలని లేదంటే కలెక్టరేట్‌కు తామే వెళ్తామని రైతులు పెద్దపెట్టున నినాదాలు చేయడంతో రాస్తారోఖో దగ్గరకు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ రాగాఆయనకు వినతి పత్రం అందజేశారు. మీరు విన్నివించిన విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం నిర్వాసితులు ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో కానుకుర్తి గ్రామ మాజీ సర్పంచ్ భీమ్‌రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జోషి, దివ్యాంగుల హకుల వేదిక జిల్లా అధ్యక్షులు కాశప్ప, భూనిర్వాసితుల సంఘం జిల్లా నాయకులు ధర్మరాజు, ఆంజనేయులు, సింగారం హనుమంతు, అంజప్ప, లక్ష్మీకాంత్, కేశవ్, రవి, రాఘవేందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, తరుణ్, శ్రీనివాస్‌రెడ్డి, మోహన్ , మహేశ్‌కుమార్‌గౌడ్, రామకృష్ణ, జిలానీ తదితరులు పాల్గొన్నారు.