అయిజ, జనవరి 25 : ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇసుక, మట్టి వ్యాపారాలపైనే ధ్యాస ఉందని, ప్రజల సంక్షేమాన్ని తుంగలో తొక్కారని మండిపడ్డారు. అయిజ పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన అయిజ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, గత పదేళ్లలో మున్సిపాలిటీ అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంతో కృషి చేసిందన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పథకాలను అటకెక్కించిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అన్ని బంద్ చేస్తారని ఆరోపించారు. అయిజ మున్సిపాలిటీ బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు కలిసికట్టుగా శ్రమించి బీఆర్ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అలంపూర్ నియోజకవర్గంలో వసూల్ రాజాలు పెరిగారని, అలాంటి వసూల్ రాజాలకు మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వొద్దని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ప్రజలను కోరారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఇసుక, మట్టి దందాలపైనే ధ్యాస ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లోకి చేరగా, గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.
మండలంలోని పులికల్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 200 మంది కార్యకర్తలు ఆదివారం గ్రామంలో ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమాల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ దేవన్న, మాజీ వైస్ చైర్మన్లు నర్సింహులు, నాగన్న గౌడ్, మాజీ కౌన్సిలర్లు సీఎం సురేశ్, సువర్ణ, శశికళ, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య, సింగిల్ విండో మాజీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, వావిలాల రంగారెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.