కల్వకుర్తి, జూన్ 15 : శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న తీరుగా కార్పొరేట్ పాఠశాలలు పనిచేస్తున్నాయి. పుస్తకాలు, స్కూల్ బ్యాగులు ఇలా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని ప్రైవేట్ స్కూల్స్‌లో విక్రయించరాదని ప్రభుత్వం హుకూం జారీ చేసింది. అయితే అందుకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కొత్త ప్రణాళికలు రచిస్తున్నాయి. పాఠశాలల పక్కనే ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అందులోనే పుస్తకాలు, నోట్‌బుక్స్ ఇలా విద్యార్థులకు కావాల్సిన సామగ్రిని విక్రయిస్తున్నారు. ఇదే విషయమై ఎంఈవోను ప్రశ్నిస్తే పాఠశాలలో విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని.. పాఠశాల వెలుపల విక్రయిస్తే ఏమీ చేయలేమని బదులిచ్చారు.
కల్వకుర్తి పట్టణంలో నాగర్‌కర్నూల్‌కు వెళ్లే దారిలో ఓ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం కొత్త పద్ధతులతో వి ద్యార్థుల తల్లిదండ్రులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్న ది. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, ఏకరూప దుస్తులు, టై, బెల్ట్ వంటివి కొనుగోలు చేయాలని నిబంధన విధించగా.. ఇది ఏ కాగితాల్లోనూ కనిపించదు.. కేవలం నోటి మాటల ద్వారానే ఈ తతంగం జరుగుతున్నది. ప్రభుత్వం పాఠశాలల్లో బుక్స్, టై, బెల్ట్‌లు విక్రయించొద్దని ఆదేశించడంతో సదరు స్కూల్ యజమాన్యం పాఠశాల పక్కనే ఒక ఇంటిని అద్దెకు తీసుకుని సిబ్బందిని నియమించి పుస్తకాల వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నది.
పుస్తకాల ధరలను చూస్తే మాత్రం కండ్లు బైర్లు కమ్మాల్సిందే..! రెండో తరగతి పుస్తకాల ధర.రూ.6,139, నాలు గో తరగతికి రూ.8,061. మా స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచే శాస్త్ర, సాంకేతికవిద్యలు నేర్పుతాం కాబట్టి.. అందుకు అవసరమైన పుస్తకాలు ఉంటాయి. అందుకే ధరలు ఎక్కువగా ఉంటాయని పాఠశాల యజమాన్యం చెబుతున్నది. రెండో తరగతి పుస్తకాల ధర రూ.800 నుంచి గరిష్ఠంగా రూ.1,200 వరకు మాత్రమే ఉంటుంది కానీ.. వసూలు చేసేది మా త్రం రూ.6వేలకు పైగా నే. ఇలా కేవలం పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ఇతర సామగ్రి విక్రయాలతో పాఠశాలకు రూ.లక్షల్లో లాభం వస్తుందనేది జగమెరిగిన సత్యం. విద్యార్థుల తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని స్కూల్ యాజమాన్యాలు దందా చేస్తున్నాయని విద్యాభిమానులు మండిపడుతున్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల డిస్కౌంట్ ఆఫర్ కూడా నడుస్తున్నది. ఫీజు మొత్తం ఒకేసారి చె ల్లిస్తే 20 శాతం రాయితీ.. మూడు విడుతల్లో చెల్లిస్తే 15 శాతం డిస్కౌంట్ ఇస్తామని లెక్కలేసి మరీ చెబుతున్నారు. ఉదాహరణకు రెండో తరగతి ఫీజు రూ.32వేలు అనుకుంటే.. మూడు విడుతల్లో చెల్లిస్తే 15 శాతం రాయితీ అంటే రూ.4,800 డిస్కౌంట్ పోనూ రూ.27.200 చెల్లించొచ్చు. మొత్తం ఒకేసారి చెల్లిస్తే 20 శాతం అంటే రూ.6,400 డిస్కౌంట్ పోనూ రూ.25,600 చెల్లించొచ్చు.. అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు.
విద్యను ప్రైవేటు పాఠశాలలు వ్యాపారం చేస్తున్నాయి. పుస్తకాలు, ఫీజుల పేరుతో అడ్డుగోలు గా దోపిడీకి పాల్పడుతున్నాయి. అధిక ఫీజులు వ సూలు చేయడమే కాకుం డా.. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, దుస్తులు ఇలా విద్యార్థులకు అవసరమైన వాటిని విక్రయిస్తూ రూ.వేలకు వేలు సొమ్ము చేసుకుంటున్న ప్రైవేటు స్కూళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. నిబంధనలు పాటించని పాఠశాలల అనుమతులను వెంటనే రద్దు చేయాలి. అవసరమైతే సదరు పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు మరీ బరితెగించాయి.