దసరా పండుగ వేళ ధరలు దడ పుట్టిస్తున్నాయి. కూరగాయల రేట్లు కాక రేపుతుండగా.. నిత్యావసరాలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాట కిలో రూ.80 కి చేరి మాట విననంటున్నది. ఉల్లి ధరలు కూడా రూ.60కి చేరి కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
కందిపప్పు కిలో రూ.180కి చేరి సామాన్యులకు అందనంటూ.. పేద, మధ్య తరగతికి శరాఘాతంగా మారింది. దీంతో పేదల ఇండ్లల్లో పండుగ భారంగా మారింది. దిగుమతులు తగ్గిపోవడంతో మార్కెట్లల్లో రేట్లు విపరీతంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
– నాగర్‌కర్నూల్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ)
కూరగాయలు, నిత్యావసరాల సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని నెలలుగా వీటి ధరలు తగ్గినట్లే తగ్గి రియల్ వ్యాపార రంగంలో మాదిరిగా మళ్లీ ఎప్పటి ధరకు చేరుకుంటున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నలుగురైదుగురిని మించి ఉండే కుటుంబాల్లో రోజులు దినదినగండంగా మారాయి. టమాట ధర మోత మోగిస్తున్నది. ఏకంగా రూ.80కి చేరుకోవడం గమనార్హం. గతంలో రూ.100 దాటిన ఈ ధర రెండు నెలల కిందట తగ్గిపోగా తిరిగి సెంచరీకి సమీపిస్తున్నది. దీనివల్ల కొనలేని.. తినలేకపోతున్నామంటూ సామాన్యులు వాపోతున్నారు.
ప్రస్తుతం దసరా పండుగ సీజన్ కావడంతో ధరలు మోత మోగిస్తున్నాయి. ఎంతకీ తగ్గకపోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నా రు. పండుగకు ఇండ్లకు సున్నాలు, రంగులు వే సుకోవడం, ఇతరచిన్న చిన్న సామాగ్రి కొనుగో లు చేయడం.. ముఖ్యంగా కొత్త బట్టలు కొ నడం సహజం. ఈ క్రమంలో ఆ వస్తువులు, బ ట్టల సంగతలా ఉంచితే.. కనీసం పండుగ పూ ట కడుపునిండా తినలేని స్థితిలో పెరిగిన ధరలు తలమీద బరువుగా మారాయి. చికెన్, మటన్ ఏమోగానీ కనీసం పప్పన్నం కూడా తినలేని విధంగా పరిస్థితి తయారైందని వాపోతున్నారు.
కంది పప్పు కిలో రూ.170 నుంచి రూ.180 చేరింది. కిలో టమాట రూ.80కి చేరింది. చికెన్ కిలో ధర రూ.230కి అటు ఇటుగా ఉండగా.. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మటన్ కిలో రూ.800 చొప్పున ఉంది. పప్పు, టమాట, మాంసం ధరలు ఇలా ఉంటే మిగిలిన ఆకు కూ రలు, ఇతర సరుకుల ధరలు సైతం అందని ద్రాక్షగా మారాయి. జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో ఏ కూరగాయలు చూసినా దాదాపు గా కిలో రూ.60 చొప్పున ధర ఉంటుంది. బ జారుకు వెళ్లే ప్రజలకు పావుకిలో రూ.20, అర్ధకిలో రూ.40, కిలో రూ.60 అంటూ వ్యాపారు లు అమ్మకాలు చేస్తున్నారు.
దీనివల్ల చిన్న కుటుంబీకులు, పేదలకు ఏ కూరగాయలు, ఎం త పరిమాణంలో కొనాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పెద్ద కుటుంబాల్లోని ప్రజలైతే ఎక్కువగా తక్కువ ధర పలికే దొండకాయ, బెండకాయలను కొనుగోలు చేస్తున్నారు. ఇక ఆకు కూరల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మా రింది. గతంలో రూ.20కి 5 చొప్పున పాలకూ ర, తోటకూర, పుంటికూర, ఇతర ఆకుకూరల కట్టలను విక్రయించే వ్యాపారులు ఇప్పుడు రూ.20కి ఒక కట్ట చొప్పున అమ్ముతున్నారు. దీంతో ఆకు కూరలు చాలా మంది కొనడం లేదు. హోల్‌సేల్ నుంచి తీసుకొచ్చిన ధరలకు, రైతుల నుంచి కొన్న ధరలకు అదనంగా పెంచి వ్యాపారం చేస్తున్నారు. దీంతో పండుగ పూట ధరలు బెంబేలెత్తిస్తున్నాయి.
వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచడంతో కంపెనీలు ధరలను అమాంతం పెంచేశాయి. దీంతో కేవలం రెండు వారాల వ్యవధిలోనే లీటర్ నూనెపై రూ.20 నుంచి రూ.30 వరకు ధర పెరిగింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ.130, పామాయిల్ లీటర్ ధర రూ.125కు చేరింది. దీంతో సామాన్యుడిపై భారం పడింది. దేశీయంగా తయారయ్యే సోయాబీన్, వేరుశనగ, రైస్‌బ్రాన్ ఆయిల్ ధరలు విదేశీ ఉత్పత్తులతో సమానంగా ధరలు పెంచారు. గత నెల ఇదే సమయానికి రైస్‌బ్రాన్ లీటర్ ధర రూ.115 నుంచి రూ.120 వరకు ఉండగా.. నెల రోజుల్లో అంటే ప్రస్తుతం రూ.135 మార్క్‌ను దాటింది. ఇక పల్లీ ఆయిల్ విషయానికొస్తే రూ.170 నుంచి రూ.180 వరకు ధర మార్కెట్లో ఉన్నది. దిగుమతి సుంకం పరిధిలోకి రాని దేశీయ నూనెల ధరలను సైతం పెంచడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.