నెట్వర్క్ మహబూబ్‌నగర్, జనవరి 10 : గోవింద నామస్మరణతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రతిధ్వనించింది. ముక్కోటి ఏకాదశి వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం వేకువ జామున 4 గంటల నుంచే దర్శనభాగ్యం కల్పించడంతో శ్రీవారిని ఉత్తర ద్వారం మీదుగా భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. తిలకించి భక్తజనం పులకించిపోయారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని వట్టెం, పాలెం, శ్రీపురం, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్, జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉత్తనూరు, పాలమూరులోని సింహగిరి, కాటన్‌మిల్ వెంకన్న ఆలయంతోపాటు జిల్లాలోని కురుమూర్తి, మన్యంకొండ, గంగాపురం, నారాయణపేట జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ కిటకిటలాడాయి. వేద మంత్రోచ్ఛరణలతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.
మహబూబ్‌నగర్/వనపర్తి టౌన్, జనవరి 10 : ముక్కోటి ఏకాదశి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డు ఉన్న వేంకటేశ్వర స్వామిని బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దర్శించుకున్నారు. అందరినీ చల్లగా చూడాలని భగవంతుడిని వేడుకున్నారు. తిరుమల ఘటన బాధాకరమని, మళ్లా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అలాగే వనపర్తి జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న విఠలేశ్వర పాండురంగస్వామి ఆలయంలో గులాబీ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు.