గట్టు ఎత్తిపోతల పథకం పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. రూ.586 కోట్లతో.. 1.32 టీఎంసీల సామర్థ్యంతో ప్రారంభమైన పనులు మందకొడిగా సాగుతున్నాయి. రూ.20 కోట్ల మేర పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించాల్సి ఉండడంతో జాప్యం జరుగుతోంది. దీంతో రివిట్మెంట్ పనులతోపాటు క్యాంపులోనే వాహనాలు నిలిచిపోయాయి. దీనికి తోడు 3 టీఎంసీలకు సామర్థ్యం పెంపు అంశం ప్రతిపాదనలకే పరిమితమైంది.
గతేడాది సెప్టెంబర్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పనులను పర్యవేక్షించినా.. పనుల్లో వేగం పెరగలేదు. ప్రస్తుత పురోగతిని చూస్తే మరో రెండేండ్లయినా పూర్తయ్యేది కష్టంగానే కనిపిస్తున్నది. దీంతో పనులు పూర్తయి ‘గట్టె’క్కేనా? అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. త్వరలో కార్యరూపం దాల్చి 33 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనుకున్న గట్టు, కేటీదొడ్డి మండలాల కర్షకుల
ఆశలు అడియాశలుగా మిగిలిపోగా.. సాగునీరు పారించి సస్యశ్యామలం చేద్దామనుకున్న మాజీ సీఎం కేసీఆర్
లక్ష్యం నీరుగారుతోంది.
– గద్వాల, ఆగస్టు 4
గట్టు ఎత్తిపోతల పథకం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. కృష్ణానది జలాలతో గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని బీడు భూములకు సాగునీటిని అందించే ఈ పోతల పథకం పనులపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పనులు పూర్తయితే నెట్టెంపాడ్ ప్రాజెక్టు ద్వారా సాగునీటికి నోచుకోని ప్రాంతాలైన గట్టు, ఆలూరు, తుమ్మలచెరువు, రాయపురం, జోగన్‌గట్టు, మల్లాపురం, మల్లాపురంతండా, కుచినెర్ల, చింతలకుంట, తారపురం, సోంపురం, మాచర్ల, యల్లందొడ్డి తదితర గ్రామాలతోపాటు కేటీదొడ్డి మండలాల్లోని కొన్ని గ్రామాల్లోని పొలాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు.
అయితే పనులు రెండేండ్లయినా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. తుమ్మలచెరువు సమీపంలో ర్యాలంపాడ్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొని గట్టు మండలం రాయపురం సమీపంలో గజ్జలమ్మ గట్టు దగ్గర 1.320 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టారు. లిఫ్ట్ ద్వారా గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని 33 వేల ఎకరాలకు సాగు నీరు అందించడంతోపాటు ఈ మండలాల్లో 44 చెరువులతోపాటు కుంటలను నీటితో నింపి డిస్ట్రిబ్యూటరీల ద్వారా పొలాలకు సాగునీటిని అందించాల్సి ఉంటుంది. సాగునీరు అందని ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పను లు పడకేసింది.
ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా 3 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసే పంప్‌హౌస్‌కు నీటిని పంపిస్తారు. పంప్‌హౌస్ నుంచి 12 మెగావాట్ల(ఎండబ్ల్యూ) సామర్థ్యం కలిగిన రెండు మోటార్ల ద్వారా మూడు మీటర్ల వ్యాసం కలిగిన పైప్‌లైన్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని గజ్జలమ్మ గట్టు రిజర్యాయర్‌లోకి నీటిని తోడిపోస్తారు. 50 రోజులపాటు ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి గట్టు ఎత్తిపోతల పథకానికి నీటిని ఎత్తిపోయనున్నారు. రిజర్వాయర్ దగ్గర నుంచి ఏర్పాటు చేసే కుడి కాల్వకు 18 కి.మీ., ఎడమ కాల్వ 15 కి.మీ. పొడవున తవ్వి నీటిని కాల్వ ద్వారా తరలించే 33 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. దీంతోపాటు ఆయా మండలాల్లో ఉన్న 44 చెరువులు నింపనున్నారు.
బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా గట్టు ఎత్తి పోతల పనులు స్లోగా నడుస్తున్నాయి. రూ.586 కోట్లతో గట్టు ఎత్తిపోతల పనులు చేపట్టడానికి కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ ప్రభావం గట్టు ఎత్తిపోతల పనులపై పడింది. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టులకు నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీంతో పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు. వాస్తవంగా పనులు ప్రారంభమైనా నాటి నుంచి రెండేండ్లలో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకరావాలనేది ఒప్పందం. అయితే పనులు ప్రారంభ సమయం పూర్తయి మరో ఏడాది గడువు ఇచ్చిన పనులు పూర్తి కాలేదు. వేగం చేయాలని ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చినా పనులు మాత్రం స్పీడ్ అందుకోవడం లేదు. ప్రస్తుతం పనులు నామామాత్రంగానే జరుగుతున్నాయి. ప్ర భుత్వం ఏజెన్సీ నిర్వాహకుడికి బిల్లులు చెల్లింపుల్లో జాప్యం చేయడంతో పనులు పూర్తి స్థాయిలో చేయడం లేదు. గతేడాది సెప్టెంబర్ నెలలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షించి వెళ్లినప్పటికీ పనుల్లో మాత్రం వేగం పెరగలేదు. అయితే పనులు ఆగిపోయాయనే అపవాదు రాకుండా కొద్దిపాటి వాహనాలతో ప్రాజెక్టుకు అవసరమైన మట్టిని తరలించడం, చదును చేసే పనులు చేస్తున్నారు. కట్టకు సంబంధించి రివిట్మెంట్ కొంత దూరం చేసి పనులు నిలిపివేశారు. జాప్యానికి గల కారణాలపై ఆరా తీస్తే రూ.20 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిసింది.
ప్రస్తుతం నిర్మాణం చేపడుతున్న గట్టు ఎత్తిపోతల పథకం 1.32 టీఎంసీలతో నిర్మిస్తున్నారు. అయితే దీనిని 3 టీఎంసీలకు పెంచితే మరింత ఆయకట్టు సాగులోకి వస్తుందని భావించి పెంచే విధంగా అనుమతులు ఇవ్వాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమైనట్లు తెలిసింది. రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు సంబంధించి ప్రభు త్వం నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపి వేసినట్లు తెలిసింది. ప్రస్తుతం కాంట్రాక్టర్ ఈ ఎత్తిపోతలకు సంబంధించిన మెటీరియల్ మొత్తం సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం చేసిన పనులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండగా.. సామర్థ్యం పెంచితే అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉన్నది. ఇందుకనుగుణంగా ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేస్తుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చేసిన పనులకే డబ్బులు లేకపోతే పెంపునకు సంబంధించి ఇస్తుందా..? అన్నది ప్రశ్న. అందుకే ప్రభుత్వం అనుమతి కోసం పనులు నిలిపి వేసినట్లు సమాచారం. అనుమతినిస్తే డిజైన్ మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అనుమతి విషయంలో ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్పా పనులు ముందుకు సాగేలా కనిపించడం లేదు. ఏది ఏమైనా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గట్టు ఎత్తిపోతల పనులు నత్తనడకన సాగుతున్నాయి.