మహబూబ్ నగర్ నెట్వర్క్, ఆగస్టు 30 : యూరియా కోసం రైతులకు పాట్లు తప్పడం లేదు. సరైన సమయంలో పంట పెరిగేందుకు అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పీఏసీసీఎస్, విక్రయ కేంద్రాల వద్దకు తెల్లవారుజాము నుంచే పరుగులు పెడుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లు నిలబడి.. చెప్పులు, పాస్‌బుక్కులు, ఆధార్‌కార్డుల జిరాక్స్‌లు వరుసలో పెట్టినా.. అరకొరే అందుతుండడంతో అయోమయానికి గురవుతున్నారు. పలు చోట్ల పోలీస్ పహారాలో యూరియా పంపిణీ చేస్తున్నారు. శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఎగబడ్డారు.
వనపర్తి జిల్లా అమరచింత మండలం మస్తీపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సెంటర్ వద్ద పెద్ద ఎత్తున చెప్పులను రైతులు వరుసలో ఉంచారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని రైతు వేదిక వద్ద తెల్లవారుజాము 5 గంటలకే రైతులు చేరుకుని బారులు తీరారు. సింగిల్ విండోలో నిల్వ ఉన్న 800 బస్తాలకు 400 మంది రైతుల తరలివచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని టోకెన్లు అందజేశారు. అందని రైతులు నిరాశతో వెనుదిరిగారు. గట్టులో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 450 బస్తాలు పీఏసీసీఎస్కు రాగా.. రైతులకు అధికారులు టోకెన్లు జారీ చేశారు.
అయితే టోకెన్లు లభించని రైతులు ఏవో హనుమంత్రెడ్డితో వాగ్వాదానికి దిగారు. యూరియా నిల్వ ఉన్న వరకే టోకెన్లు ఇస్తే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టోకెన్లతోపాటు యూరియా పంపిణీని నిలిపివేయాలని పట్టుబట్టారు. దీంతో చేసేదిలేక అధికారులు కొంత సేపు ఆపారు. అనంతరం పీఏసీసీఎస్ చైర్మన్ వెంకటేశ్ సర్దిచెప్పడంతో రైతులు శాంతించారు. అనంతరం పోలీస్ పహారాలో యూరియా పంపిణీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులోని ఆగ్రో రైతు కేంద్రానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం టోకెన్లు అందించిన వారిలో చాలా మందికి యూరియా పంపిణీ చేయగా.. అందని రైతులు వెనుతిరిగారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోటకదిర పరిధిలోని అప్పాయపల్లి పీఏసీసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచి రైతులు క్యూలైన్లో వేచి ఉన్నారు.
పాతబస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ ఎరువుల విక్రయ కేంద్రం వద్ద టోకెన్లు జారీ చేశారు. తర్వాత యూరియా అందించకపోవడంతో పలువురు రైతులు తెలంగాణ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో అన్నదాతలు శాంతించారు. నవాబ్‌పేట సింగిల్‌విండో కార్యాలయ ఆవరణలో యూరియా పంపిణీ ఉద్రిక్తతకు దారి తీసింది. కొరత కారణంగా స్వల్ప తోపులాట చోటుచేసుకున్నది. పెద్ద ఎత్తున రైతులను అదపు చేయడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. విండోకు 600 బస్తాల యూరియా రాగా.. శనివారం అర్ధరాత్రి ఒంటి గంటల తర్వాత విండో కార్యాలయానికి రైతులు చేరుకున్నారు. తెల్లవారే సరికి వెయ్యి మందికిపైగా బారులుతీరారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా.. పలువురు మహిళా రైతులు కిందపడిపోయారు.
తిమ్మయ్యపల్లికి చెందిన మైబమ్మ కింద పడిపోవడంతో గాయాల పాలైంది. ఒక్కో రైతుకు 2 బస్తాల చొప్పున అందించ గా.. అందని రైతులు నిరాశతో ప్రభుత్వాన్ని శాపనా ర్థాలు పెడుతూ వెనుతిరిగారు. ఉదయం 4 గంటల నుంచి హన్వాడ పీఏసీసీఎస్ వద్ద రైతులు క్యూలో నిల్చున్నారు. 300 బస్తాల యూరియా రావడంతో గంటలోనే సరఫరా పూర్తి చేయగా.. చాలా మందికి దొరకలేదు. అదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ ఎంపీటీసీ చెన్నయ్యతోపాటు పలువురు రైతులతో మాట్లాడారు. యూరియా ఎందు కు రావడం లేదని ఏవో కిరణ్‌కుమార్, ఎస్సై వెంకటేశ్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.
తర్వాత రాస్తారోకో చేపడు తామని హెచ్చరించడంతో సోమవారం యూరియా వస్తుందని ఎస్సై చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీలించేందుకు ఏవో రమేశ్ రాగా.. రైతుల ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ‘యూరియా సకాలంలో అందక ఇబ్బందులు పడ్తున్నాం.. ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల వద్దకు వెళ్దామంటే యూరియాతోపాటు వేరే ఎరువులు అంటగడుతున్నారు.. అవసరం లేకపోయినా తీసుకోవాలని బలవంతం చేస్తున్నారు.. వాటిని తీసుకుంటే అదనంగా రూ.వెయ్యి ఎక్కువ అవుతుంది.. ఏం చేయమంటారు’.. అని నిలదీశారు.
మరికల్, ఆగస్టు 30 : ఒక వైపు భారీ వర్షాలు.. మరోవైపు వరినాట్లు వేసుకొని ఎరువులు వేసేం దుకు అదును దాటిపోతుందన్న బాధ.. దీనికి తోడు యూరియా కష్టాల కడలిలో ఉన్న రైతులపై సర్కారు, అధికారులు సైతం కర్కశంగా వ్యవ హరిస్తున్నారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సా గు చేసిన పంటలు కండ్ల ముందే నాశన మవు తుండగా రోజుల తరబడి తిరిగినా యూరి యా దొరకని పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో శని వారం మరికల్ సహకార సంఘానికి 600 బస్తాల యూరియా రావడంతో రైతులు ఒక్కసా రిగా గుం పుగా చేరారు. క్యూలో ఉండాలని అధికారులు చెప్పినా పెద్ద సంఖ్యలో రైతులు తరలిరావడంతో చేసేది లేక చేతులెత్తేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో మరికల్ పోలీసులు సహకార సం ఘం వద్దకు చేరుకొని రైతులకు టోకెన్లను పంపిణీ చేశారు.
ఈ సమయంలోనే రైతులు పెద్ద ఎత్తున ఒకరినొకరు తోసుకుంటుండడంతో ఎస్సై రాము పరిస్థితిని అదుపు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలోనే రా కొండ గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ రెడ్డిపై చేయిచేసుకున్నారు. అనంతరం రైతులను సముదాయించి ఎస్సై రైతు లకు యురియా పంపిణీ చేయించారు. రైతులు యూరియా కోసం ఎగబడుతుండడంతో మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి, ధన్వాడ ఎస్సై రాజశేఖర్ తీలేరు వద్దకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా రైతు సత్య నారాయణరెడ్డి మాట్లాడుతూ కొన్నాళ్లుగా యూ రియా కోసం తిరుగుతున్నామని, పడరాని పాట్లు పడుతున్నామన్నారు. ఈ క్రమంలో అనుకోని పరిస్థితిలో ఎస్సై చేయి చేసుకున్నారని, ఉద్దేశ పూర్వకంగా కాదని ఆయనన్నారు. దీంతో రైతులంతా శాంతి ంచి యూరియా తీసుకెళ్లారు.
మద్దూర్ (కొత్తపల్లి) ఆగస్టు 30 : వ్యయప్రయాసాల కోర్చి వరిపంటలు సాగు చేసినం.. కాంగ్రెస్ సర్కారు, అధికారులు ముందుసూపు లేకుండా యూరియా సరిపోయినన్ని తేలేక రైతులను అరిగోస పెడుతున్నారు.. అదును దాటితే పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కొత్తపల్లి మండల కేంద్రంలో శనివారం యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రైతు సేవా కేంద్రాల వద్ద సరిపడా యూరియా లేక రోజుల తరబడి తిరుగుతూ.. గంటల తరబడి క్యూలో నిల్చొని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, ప్రైవైట్ ఫర్టిలైజర్ దుకాణాలకు వెళ్తే అవసరం లేకపోయినా యూరియాతోపాటు ఇతర ఎరువులు అంటగడుతూ అదనంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో ఏవో రమేశ్‌ను రైతు సేవా కేంద్రం వద్దకు రాగా, రైతులు ఆయనను నిలదీశారు. సమయానికి ఎరువులు పంపిణీ చేయకుంటే పంటలు ఎలా సాగు చేయాలని ప్రశ్నించారు. ఇందుకు ఏవో స్పందించి రెండు, మూడు రోజుల్లో సరిపడా యూరియా అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఉన్నారు.