Urea Check Post | మాగనూరు, కృష్ణ, ఆగస్టు 22 : నారాయణపేట జిల్లా నుండి ఇతర రాష్ట్రాలకు యూరియాను అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో యూరియా అక్రమ రవాణాను అరికట్టేందుకు.. కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణ చెక్‌పోస్టు వద్ద నామమాత్రంగా యూరియా తనిఖీ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు.
అయితే కర్ణాటక సరిహద్దుగా ఉన్న కృష్ణ మండలం చేగుంట, మాగనూరు మండలం ఉజ్జలి, తాళం కేరి, బైరంపల్లి గ్రామాల మీదుగా అక్రమ యూరియా సరఫరా అవుతుందని ఉమ్మడి మండల ప్రజలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. యూరియా అక్రమ రవాణాను అరికట్టేందుకు జాతీయ రహదారిపై చెక్‌పోస్టును ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని మండల రైతులు పేర్కొన్నారు. ఈ విషయంపై ఉమ్మడి మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్‌ను వివరణ కోరగా నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడ మాత్రమే చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఏవో సుదర్శన్ గౌడ్ చెప్పుకు వచ్చారు.