మాగనూరు, జూలై 5 : నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తే భవిష్యత్తులో తమకు సాగు, తాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుందని మాగనూరు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్తల్ మండలం కాచ్వార్ సమీపంలో కొనసాగుతున్న సిమెంట్ పైపుల తయారీకి రాఘవ కన్స్ట్రక్షన్ ప్రతినిధి బృందం మాగనూరు పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను స్థానికులు, ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. వారం రోజుల కిందట నారాయణపేట ఆర్డీవో రాంచందర్, మక్తల్ సీఐ రాంలాల్ రాఘవ కన్స్ట్రక్షన్ ప్రతినిధులు, స్థానికులతో తాసీల్దార్ కార్యాలయంలో రెండు రోజులపాటు చర్చలు నిర్వహించగా, వాగు నుంచి పిడికెడు మట్టిని తరలించినా ఊరుకునేది లేదని గ్రామస్తులు తేల్చిచెప్పారు.
అయినా అవేవీ పట్టించుకోకుండా కన్స్ట్రక్షన్ ప్రతినిధులు అధికార బలంతో పెద్దవాగులో రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకొని ఇసుక రవాణాకు మార్గం సుగమం చేసుకున్నారు. అంతేకాకుండా శనివారం తాసీల్దార్ నాగలక్ష్మి, డీటీ సురేశ్, ఎస్సై అశోక్బాబు వాగు వద్దకు చేరుకొని ఇసుక రవాణాకు అడ్డు తగిలితే కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులను బెదిరింపులకు గురిచేశారు. అధికారులు, పోలీసులు దగ్గరుండి ఇసుక టిప్పర్లను తరలించారు.
కాగా, ఇసుక పైప్లైన్ టెండర్ దకించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్ వాగులో రెండు టిప్పర్లు, జేసీబీలను ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతుండగా, విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో వాగు వద్దకు చేరుకొని వాహనాలను అడ్డుకొని చావనైనా చస్తాం ఇసుక తరలించేది లేదని హెచ్చరించడంతో టిప్పర్ల ఇసుకను ఖాళీ చేసి తిప్పి పంపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులంతా మాగనూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసుకొని పోలీసులు, రెవెన్యూ అధికారులు చేస్తున్న దౌర్జన్యంపై చర్చించుకొని ఈ విషయాన్ని మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు.