చారకొండ, ఏప్రిల్ 25 : అసలే వేసవి.. ఓ పక్క మండే ఎండలు.. మరో పక్క తాగునీటి కోసం గిరిజనులు అ నేక అవస్థలు పడుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని అగ్రహారంతండాలో శుక్రవారం తాగునీటి కోసం ఖాళీ బిందెలతో గిరిజన మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. పైపులైన్ లీకేజీలు కావడంతో నీళ్లు సరిగా రావడం లేదని, తండాలో ఉన్న బోరు మోటర్లు చెడిపోవడంతో మరమతులు చేసే నాథుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ అధికారులు, పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు తమ గోడు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కనీసం ట్యాంకర్ల ద్వారానైనా నీటి సరఫరా చేయకపోవడంతో నీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. గిరిజనుల ఆందోళనతో ఎంపీడీవో ఇసాక్‌హుస్సేన్, ఎంపీవో వెంకటేశ్, మిషన్‌భగీరథ ఏఈ రితీశ్ స్పందించారు. తండాలో తాగునీటి సమస్యపై ఆరా తీసి పైపులైన్ మరమ్మతులు చే యించారు. తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపడుతామని చెప్పడంతో గిరిజనులు ఆందోళన విరమించారు.