మహబూబ్‌నగర్, జూలై 15 : పాలమూరు జిల్లా కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు సోమవారం అర్ధరాత్రి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిపై దాడి చేయడంతోపాటు ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్‌ను చెప్పుతో కొట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా బోయిన్పల్లితండాకు చెందిన దేవమ్మ (60) ఆదివారం మూత్రపిండాల సమస్యతో మహబూబ్‌నగర్‌లోని యునైటెడ్ సూపర్ స్పెషాల్టీ దవాఖానలో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పగా ఫీజును కూడా కట్టారు. చికిత్స పొందుతున్న దేవమ్మ సోమవారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని కుటుంబ సభ్యులు దవాఖాన ఎదుట అర్ధరాత్రి వరకు ఆందోళన చేపట్టారు. కోపంతో అక్కడే ఉన్న వైద్య సిబ్బందిపై దాడి చేశారు.
విష యం తెలుసుకున్న సీఐ ఏజాజుద్దీన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ అక్కడికి చేరుకొని చర్చలు జరిపారు. అయితే బాధితురాలికి మృతికి న్యాయం చేయకపోవడంతోపాటు దురుసుగా ప్రవర్తించారని, సరైన వైద్యులు, వసతులు లేకపోవడంతోనే మృతి చెందిదని, అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇలాంటి అన్యాయం ఇంకెవరికీ జరగకుండా దవాఖానను వెంటనే సీజ్ చేయాలని నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు దవాఖాన యాజమాన్యంతోపాటు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రామ్మోహన్‌పై చెప్పుతో దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడేక్కింది
రూరల్ సీఐ గాంధీనాయక్ , సీఐ ఏజాజుద్దీన్ పోలీసులు పెద్ద ఎత్తున్న అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. దవాఖానలో ఉన్న దేవమ్మ మృతదేహాన్ని బలవంతంగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నా ప్రభుత్వ జనరల్ దవాఖాన మార్చురికి పోలీసులు తరలించారు. అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో డాక్టర్ రామ్మోహన్‌పై దాడి చేయడంతో గాయపడ్డ ఆయనను ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించి వైద్యసేవలు అందించారు.
దాడికి నిరసనగా ప్రైవేట్ దవాఖాన బంద్
అకారణంగా దవాఖాన సిబ్బంది, డాక్టర్ రామ్మోహన్‌పై దాడి చేశారని తెలుసుకున్న వైద్యులు మంగళవారం దవాఖానల బంద్‌కు పిలుపునిచ్చారు. దాడికి గురైన రామ్మోహన్‌కు టుటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోపాటు ఎస్పీ జానకిని కలిసి ఫిర్యాదు చేశాడు. మృతురాలి కుటుంబ సభ్యులు కూడా తమను దవాఖాన సిబ్బందితోపాటు డాక్టర్ అమిత్ మంకాల్ కులం పేరుతో ధూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఐ ఎజాజుద్దీన్కు ఫిర్యాదు చేశారు.