మహబూబ్నగర్: మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Travel Bus) దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న టావెల్స్ బస్సు వెనక టైరు ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్నవారంతా గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను దించేశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. కాగా, ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద సమయంలో మెుత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
గద్వాల జిల్లాలో..
మరోఘటనలో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్లో బొలెరో, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని బుడమోర్సు గ్రామానికి చెందిన మురళిగా గుర్తించారు. ఇంటర్ చదువుతున్న అతడు పని నిమిత్తం వెళ్తుండగా వేగంగా వచ్చిన బొలెరో అతన్ని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.