పాలమూరు, జూన్ 18 : పాలమూరులో 14 రోజులకోసారి తాగునీరు వస్తుండేవని.. అలాంటిది తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా నట్టింటికి తాగునీరు తెచ్చి మహిళల కష్టాలు తీర్చారని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రిశ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మన్యంకొండ మిషన్‌భగీరథ నీటిశుద్ధి కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన మంచినీళ్ల పండుగ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు 80శాతం రక్షిత మంచినీటి సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. గతంలో తాగునీటి కోసం మహిళలు బిందెలతో కిలోమీటర్ల దూరం నడిచి తెచ్చుకొని అష్టకష్టాలు పడ్డారని గుర్తుచేశారు. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ ప్రతిరోజూ శుద్ధమైన తాగునీరు అందిస్తున్నారన్నారు.
ఈ సందర్భంగానే నీటిశుద్ధి కేం ద్రాల వద్ద మంచినీళ్ల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానది తిరుగుజలాల నుంచి శ్రీశైలం వద్ద ఎల్లూరు రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి పైప్‌లైన్ ద్వారా తాగునీటిని తీసుకువచ్చి మన్నెంకొండ నీటిశుద్ధి కేంద్రం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు నారాయణపేట జిల్లాకు నీటిని శుద్ధి చేసి అందించడం జరుగుతుందన్నారు. మిషన్ భగీరథ నీరు మినరల్ వాటర్ కన్నా గొప్పదని, ఎన్నో మినరల్స్ ఈ నీటిలో ఉన్నాయన్నారు. కృత్రిమంగా దేవుడిచ్చిన వరప్రసాదంగా వచ్చిన ఈనీరు ఎంతో శ్రేష్టమన్నారు. ప్రతిఒక్కరూ మిషన్‌భగీరథ తాగునీటిని తాగాలని కోరారు. మిషన్ భగీరథ తాగునీటిని శుద్ధి చేసేందుకు ఎంతో మంది ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది శ్రమిస్తున్నారని, వారి శ్రమ ఫలితంగా నేడు మనందరం మంచినీళ్లు తాగుతున్నామని కొనియాడారు. పట్టణంలో ఎక్కడైనా కుళా యిలు లేకుంటే తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, వైస్ ఎంపీపీ అనిత, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మిషన్ భగీరథ సీఈ చెన్నారెడ్డి, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు వెంకట్‌రెడ్డి, పుల్లారెడ్డి, తాసీల్దార్ పాండు, డీపీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పారదర్శక పాలన..
నారాయణపేట టౌన్, జూన్ 18 : ప్రజలకు పారదర్శకమైన పాలన అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, అందులో భాగంగానే ప్రతి జిల్లాకు సమీకృత కలెక్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం నారాయణపేటలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను కలెక్టర్ శ్రీహర్షతోకలిసి పరిశీలించారు.
చెక్‌పోస్ట్ సిబ్బందిపై ఆగ్రహం..
మక్తల్ టౌన్, జూన్ 18 : కర్ణాటక, గోవా రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తెలంగాణలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఎక్సైజ్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కృష్ణ బ్రిడ్జి సమీపంలోని ఎక్సైజ్ చెక్‌పోస్టును మంత్రి తనిఖీ చేశారు. సిబ్బంది లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయిచూర్ నుంచి మక్తల్ వైపు వస్తున్న వాహనాలను మంత్రి స్వయంగా తనిఖీ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఉన్నారు.